ఒడిశాలో చోటుచేసుకున్న ఓ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరుగురు చనిపోవడానికి.. ఫార్మాసీ తప్పిదమా, నర్సింగ్ విఫలమా, లేక మందు నిల్వలలో లోపమా అన్నదానిపై విచారణ చేస్తున్నారు.
ఒడిశా లోని కోరాపుట్ జిల్లా కేంద్రంలోని సాహిద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఘోర వైద్య విపత్తు చోటుచేసుకుంది. ఐసీయూ, సర్జికల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మృతుల కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, అర్ధరాత్రి సమయంలో ఆస్పత్రి సిబ్బంది ఇంజెక్షన్ వేయడం వల్లే ఈ మరణాలు సంభవించాయని వారు ఆరోపిస్తున్నారు.
ఇంజెక్షన్ వేసిన కొద్ది నిమిషాల్లోనే రోగులు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిపోయారు, డాక్టర్లు రావేసరికి ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి ఐదుగురు మరణించగా, ఈ ఉదయం మరో రోగి కూడా ఇంజెక్షన్ ఇచ్చిన కొద్ది క్షణాల్లోనే మృతి చెందడం ఈ ఘటనను మరింత ఉద్రిక్తతకు దారితీసింది. మరణించిన వారంతా ఇటీవల అదే ఆస్పత్రిలో సర్జరీలు చేయించుకున్నవారే కావడం విచారకరం.
చనిపోయిన తమ కుటుంబ సభ్యులకు తప్పుగా ఇంజెక్షన్లు వేసినందుకే ఈ పరిణామం చోటుచేసుకుందనీ, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, బాధ్యత వహించాల్సినవారి పట్ల చర్యలు తీసుకోవాలని బాధితుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.