శంషాబాద్ లో కందకట్ల సిద్దు రెడ్డి నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఆవిష్కరించిన సోనూసూద్

సమాజ సేవ కార్యక్రమాలలో భాగంగా శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని సిద్ధాంతిలో దాత కందకట్ల సిద్దు రెడ్డి సొంత నిధులతో నిర్మించిన నూతన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని బాలీవుడ్ సినీ నటుడు సోనుసూద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని భవనాన్ని ప్రారంభించడంలో పాలుపంచుకున్నారు.

పాఠశాల విద్యార్థులు సాంస్కృత కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పిల్లలకు స్కూల్ బ్యాగ్ లను, బుక్స్ ను సోనూసూద్ చేతుల మీదగా అందజేశారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు నా హృదయానికి చాలా దగ్గర అని అన్నారు. తాను పంజాబీ నుంచి వచ్చినా తన సతీమణీ మాత్రం తెలుగు అమ్మాయి అని చెప్పారు. సినిమా పరంగా ఆయన కెరియర్ కూడా తెలుగు నుంచే మొదలు అయిందని, ఇక్కడే నటనలో వృద్ధి చెందాను అని వెల్లడించారు. అందుకే తెలుగు వాళ్లు అన్నా, తెలుగు అన్నా ప్రత్యేక అభిమానం అని తెలిపారు. చాలా మంది అంటుంటారు బాలీవుడ్ లో హీరోగా చేస్తావు, తెలుగులో విలన్ గా చేస్తావు ఎందుకు అని, తెలుగులో నటించడం అంటే ఎందుకో చాలా ఇష్టం అందుకే తెలుగు నుంచి ఏ క్యారెక్టర్ వచ్చినా కచ్చితంగా మీ కోసం చేస్తాను అని పేర్కొన్నారు.

తన చేతుల మీదుగా పాఠశాలను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, స్కూల్ అనేది బాలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమల కన్న చాలా గొప్పది అని అన్నారు. తన సినిమా రూ. 500 కోట్లు వసూళ్లు చేసినా, రూ. 1000 కోట్లు వసూళ్లు చేసినా వచ్చే ఆనందం కన్నా ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తే వచ్చే ఆనందం చాలా ఎక్కువ అన్నారు. కోవిడ్ సమయంలో సోనూసూద్ ఫౌండేషన్ ఎంత సేవా చేసిందో అందరికీ తెలిసిందే అలాగే సిద్ధు కూడా చాలా సోషల్ సర్వీస్ చేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ రోజు విద్యార్థుల కోసం ఉచిత పాఠశాల భవనాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది అని సోనూసూద్ పేర్కొన్నారు.

సేవా కార్యక్రమాలలో అన్నింటికన్నా ముఖ్యమైనది విద్యార్థులకు చదువు చెప్పించడం, మనలో కూడా వీలైనవాళ్లు ఒకరిద్దరి పిల్లల చదువుకు సాయం చేయాలి అని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకోసం, పాఠశాలలో కోసం నా అవసరం ఉంటే కచ్చితంగా తెలియచేయండి, నా వంతు సాయం తప్పకుండా ఉంటుందని, ఒక విద్యార్థి కూడా చదువుకు దూరం అవకూడదు అని బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ తెలిపారు.

సామాజిక సేవాకర్త, బిల్డింగ్ ప్రధాత కందకట్ల సిద్దు రెడ్డి మాట్లాడుతూ.. బాలీవుడ్ నటుడు సోనూసూద్ చేసే సేవా కార్యక్రమాలను చూసి, ఒక మనిషి తలుచుకుంటే ఇంత చేయగలడా అనే స్ఫూర్తితో తాను సేవా కార్యక్రమాలను ప్రారంభించినట్లు చెప్పారు. కోవిడ్ సమయంలో తాను చేసిన సేవా కార్యక్రమాలను సోషల్ మీడియాలో చూసిన సోనూసూద్ ముంబాయికి పిలిపించారని వెల్లడించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను చేసేవారిని ఆయన ఎప్పుడూ ప్రోత్సహిస్తూ వెన్నంటి ఉంటారని సిద్దు రెడ్డి తెలిపారు. ఈ పాఠశాలలో మన సేవలు అవసరం ఉన్నాయని తెలిసినప్పుడు, పాఠశాలను పర్యవేక్షించడానికి వచ్చినప్పుడు ఒకే గదిలో ఐదు తరగతులు నిర్వహిస్తున్నారని తెలిసి మనసు చలించి.. ఈ నూతన భవనాలను నిర్మించానని, వీటితోపాటు బాలబాలికల కోసం నాలుగు టాయిలెట్స్ ను నిర్మించినట్లు తెలిపారు.

పాఠశాల నూతన భవనాలను ఆవిష్కరించడం కోసం సోనూసూద్ సర్ ను అడగానే వెంటనే ఒప్పుకొని, ప్రత్యేకంగా అభినందించినట్లు సిద్దు రెడ్డి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి అవసరం ఉన్నా, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు, దుప్పట్లు ఇతర ఏ అవసరాలు ఉన్నా సోనూసూద్ సర్ తన వంతుగా సాయం చేయడానికి ముందుకొచ్చారు. అతి త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెడుతున్నట్లు కందకట్ల సిద్దు రెడ్డి తెలిపారు.

సామాజిక సేవాకర్త కందకట్ల సిద్ది రెడ్డి చేసిన కార్యక్రమాలు అన్నీ ఇన్ని కావు. కాషారం, రాజన్నగూడెం తదితర గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలను చక్కబెట్టి విద్యార్థులకు బ్యాగ్స్, బుక్స్, పెన్స్ అందజేశారు. అలాగే వికలాంగులకు త్రీ వీలర్ బండ్లను అందజేశారు.

రాజమండ్రి, వైజాగ్ తదితర ప్రాంతాల్లోని పేదవాళ్లకు తోపుడుబండ్లను ఉచితంగా ప్రధానం చేశారు.

విశాఖపట్నంలోని వంద మందికి పైగా ట్రైబల్ అనాధ స్టూడెంట్ లను చేరదీసిన సంస్థలకు కందకట్ల సిద్దు రెడ్డి అండగా ఉంటున్నారు. ఆ సంస్థల నిర్వహిస్తున్న భవనాల రెంట్లు కడుతున్నారు. కరోనా ఉధృత సమయంలో వేలాది మంది ప్రజలకు నిత్యావసర వస్తువులు మాస్కులు పంపిణీ చేశారు.

ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్న కందగట్ల సిద్దు రెడ్డి త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోని స్కూల్స్ లేని ఫారెస్ట్ ఏరియాలో కొత్తగా పాఠశాలలను నిర్మించి అక్కడే ఉపాధ్యాయులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను రాబోయే రోజుల్లో ఇంకా విస్తృతంగా చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.