మరోసారి ఉదార మనసు చాటిన మెగాస్టార్ చిరంజీవి

మాన‌వ‌సేవే మాధవ సేవ అని మ‌న‌సావాచా న‌మ్మే మెగాస్టార్ చిరంజీవి మ‌రో సారి త‌న ఉదార‌త చాటుకున్నారు. అసలు విషయం ఏమిటంటే ఈ తరం వారికి తెలియకున్నా 80, 90లలో కెమెరామెన్ దేవరాజ్ అంటే సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ ఉండేది. ఎందరో గొప్ప నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజిఆర్, రాజ్ కుమార్, రజినీకాంత్, కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు, మురళీమోహన్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇలా ఎందరో హీరోలతో దేవరాజ్ వర్క్ చేశారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ భాషలలో కూడా సినిమాటోగ్రాఫర్ గా దాదాపు 300కు పైగా సినిమాలు చేశారు.

అయితేనేమి ఇప్పుడు ఆయన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారు. తాజాగా ఈ విషయాన్ని ఒక యూట్యూబ్ ఛానల్ వెలుగులోకి తీసుకు వచ్చింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందిన నాగు, పులిబెబ్బులి, రాణి కాసుల రంగమ్మ వంటి సినిమాలకు కెమెరామెన్ గా పనిచేసిన దేవరాజ్ ఆర్ధిక పరిస్థితి తెలుసుకుని క్షణం ఆలస్యం చేయకుండా 5లక్షల రూపాయలిచ్చి ఆయనకు సహాయం చేశారు మెగాస్టార్ చిరంజీవి. తన నివాసానికి దేవరాజ్ ను పిలిపించుకోవడమే కాక ఆయనకు ఆతిధ్యం ఇచ్చి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.