రెండు వేల రూపాయల నోటు కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఓ యువతి రైలు పట్టాలపైకి దూకింది. ఆమెపై నుంచి మెట్రోరైల్ దూసుకెళ్లినా అదృష్టం కొద్ది బతికిబైట పడింది. ఈ సంఘటన మంగళవారం ఉదయం ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ 26 ఏళ్ల యువతి మంగళవారం ఉదయం పదిగంటల ప్రాంతంలో ఢిల్లీలోని ద్వారకా మోర్ మెట్రో స్టేషన్‌కు వచ్చింది. మరికొద్ది సేపట్లో రైలు వస్తుందనగా ఆమెకు చెందిన రెండువేల రూపాయల నోటు ఎగిరి పట్టాలపై పడింది. నోటు కోసం పట్టాలపైకి దూకిన ఆ యువతి నోటు తీసుకోవటంలో బిజీ అయ్యింది.
బిజీలో అదే పట్టాలపై వేగంగా ఆమెవైపు వస్తున్న మెట్రోరైలును గమనించలేదు. అడుగుల దూరంలోకి రైలు రాగానే అది గమనించి వెంటనే పట్టాలపై నిలువుగా పడుకుండిపోయింది. ఆ మెట్రోరైలు ఆమెపై నుంచి కదిలివెళ్లిపోయింది. అయితే ఈ ఘటనలో ఆమెకు ఏ చిన్న గాయం కాకపోవడం అదృష్టం. సీఐఎస్‌ఎఫ్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోని, లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పటంతో వదిలేశారు.