మెట్రో రైళ్లలో టాయిలెట్స్ ఎందుకు ఉండవో తెలుసా.. కారణం ఇదే..!

ప్రతిరోజూ దేశంలో లక్షలాది మంది ప్రయాణికులు మెట్రో రైళ్లపై ఆధారపడుతున్నారు. ట్రాఫిక్ జామ్‌లు, కాలుష్యం, సమయం వృథా అవకుండా సురక్షితంగా, వేగంగా గమ్యస్థానానికి చేరుకోవడానికి మెట్రో రైళ్లు పెద్ద ఊరటగా మారాయి. హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో మరింతగా ఈ రైళ్లపై ఆధారపడుతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం కాకుండా, కొన్ని నిమిషాల్లో గమ్యం చేరే అవకాశం కల్పిస్తుండటంతో మెట్రోకు వేరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.

అయితే ప్రతి సౌలభ్యం కల్పిస్తున్న ఈ మెట్రో రైళ్లలో ప్రయాణికుల కోసం ఒక ముఖ్యమైన సౌకర్యం మాత్రం ఉండదు. అదే టాయిలెట్‌. సాధారణ రైళ్లలో, అంతరాష్ట్ర బస్సుల్లో కనీసం ఒక టాయిలెట్ సౌకర్యం ఉండటం సర్వసాధారణం. అయితే మెట్రో రైళ్లలో మాత్రం ఈ సౌకర్యం ఎందుకు ఉండదని చాలామందికి సందేహం వస్తుంటుంది. ఎందుకంటే కొన్ని మెట్రో మార్గాల్లో ఒక ప్రయాణం 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు కూడా పడుతూ ఉంటుంది.

అయితే మెట్రో రైళ్లలో టాయిలెట్‌ సౌకర్యం ఉండకపోవడానికి ప్రధాన కారణం పరిశుభ్రత. రోజూ లక్షల మంది రాకపోకలతో టాయిలెట్‌ శుభ్రంగా ఉంచడం చాలా కష్టమని మెట్రో నిర్వాహకులు చెబుతుంటారు. శుభ్రత సరిగా పాటించకపోతే దుర్వాసన, అసౌకర్యం, అనారోగ్య సమస్యలు కలగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టాయిలెట్ల నిర్వహణకు అదనపు సిబ్బంది అవసరం, నిర్వహణ వ్యయం కూడా ఎక్కువగా అవుతుంది.

దీంతో పాటు మరో కీలక కారణం.. మెట్రో ప్రయాణాల దూరం. సాధారణంగా ఒక మెట్రో స్టేషన్‌ నుంచి మరొకటి చేరడానికి రెండు మూడు నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. అంటే మొత్తం ప్రయాణ కాలం ఎక్కువ అయితే 30-40 నిమిషాలు ఉండొచ్చు కానీ, ఆ మధ్యలో కూడా కావాలనుకునే స్టేషన్లలో ఎక్కడైనా దిగిపోవచ్చు. సాధారణ రైళ్లలో లేదా ఇంటర్‌ సిటీ బస్సుల్లోలా గంటల తరబడి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి మెట్రోలో ఉండదు.

అయితే, ప్రయాణ సమయంలో టాయిలెట్ అవసరం అనిపిస్తే ఏమి చేయాలి? సాధారణంగా మెట్రో స్టేషన్లలో, ముఖ్యంగా పెద్ద టెర్మినల్ స్టేషన్లు, ఇంటర్‌చేంజ్ స్టేషన్లలో టాయిలెట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. కానీ అన్ని చిన్న స్టేషన్లలో మాత్రం ఉండకపోవచ్చు. అందువల్ల ముందే తనిఖీ చేసుకుని, అవసరమైతే ప్రయాణానికి ముందు స్టేషన్‌లో ఉన్న టాయిలెట్ వాడుకోవడం ఉత్తమం.

పిల్లలతో ప్రయాణిస్తే టాయిలెట్ అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మెట్రో స్టేషన్‌లోకి ఎంటర్ అయ్యే ముందు అక్కడి సౌకర్యాలను తెలుసుకుని ఉపయోగించుకుంటే ప్రయాణం మధ్యలో ఇబ్బందులు ఎదురవ్వవు. కొన్ని మెట్రో కార్లలో టాయిలెట్ ఏర్పాటు చేయాలని కోరుకునే వాదనలున్నా, ఇప్పటివరకు నిర్వహణ సమస్యల కారణంగా ఆ నిర్ణయం విరమింపబడింది.

ప్రయాణికుల సౌలభ్యాన్ని మరింత పెంచే దిశగా రానున్న కాలంలో మెట్రో నిర్వాహకులు ఏవైనా మార్గాలు వెతుకుతారా అనేది చూడాలి. అప్పటివరకు మనం ముందే ప్రణాళికతో ఉండటం మేలు. మెట్రో రైళ్లు వేగవంతమైన గమనం, సమయపాలనతో పాటు సౌకర్యాలు అందిస్తూనే, కొన్ని పరిమితులను మనం అర్థం చేసుకుని, ఆచితూచి ప్రయాణిస్తే అసౌకర్యాలు దాటేయవచ్చు.