మిస్డ్ కాల్స్ తో రూ. 50 లక్షలు మాయం చేసిన కేటుగాళ్లు…?

ప్రస్తుతం టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. టెక్నాలజీ అభివృద్ధి చెందటం వల్ల ఉపయోగాలతో పాటు చాలా నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ టెక్నాలజీ వల్ల సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కొంతమంది సైబర్ నేరగాళ్లు టెక్నాలజీ ఉపయోగించి కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఈ టెక్నాలజీ ఉపయోగించి భారీ మొత్తంలో డబ్బులు దోచుకుంటున్నారు. ఎస్ఎంఎస్ లు ఈ మెయిల్ ద్వారా కస్టమర్లను బురిడీ కొట్టించి బ్యాంక్ అకౌంట్ ల నుండి లక్షల రూపాయలు మాయం చేస్తున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

గతంలో పాస్వర్డ్, ఓటీపీల ద్వారా అకౌంట్లో నుండి డబ్బు దోచుకునేవారు. కానీ తాజాగా కేవలం మిస్డ్ కాల్స్ ద్వారానే రూ. 50 లక్షల రూపాయలు దోచుకున్న ఘటన చర్చాంషనీయంగా మారింది. ఓటిపి అవసరం లేకుండానే కేవలం మిస్డ్ కాల్స్ ద్వారా రూ. 50 లక్షలు దోచేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. దక్షిణ ఢిల్లీకి చెందిన సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ డైరెక్టర్ అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 50 లక్షలు మాయం చేశారు. తాజాగా ఈయనకు రాత్రి 7 గంటల నుంచి 8.45 గంటల సమయంలో తన ఫోన్ కి వరుసగా మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఇలా వచ్చిన కొన్ని కాల్స్ ని ఈయన ఎత్తారు. అయితే అవతలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు ..అందువల్ల కట్ చేశారు.

ఆ తర్వాత వచ్చిన కొన్ని కాల్స్ ని ఆయన ఎత్తలేదు. కొంతసేపటి తర్వాత ఆయన ఫోన్‌కు ఆర్‌టీజీఎస్ మనీ ట్రాన్స్‌ఫర్ అయినట్లు మెసేజ్ వచ్చింది. రూ. 50 లక్షలు బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయినట్లు వచ్చిన మెసేజ్ చూసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత అతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి బాధితుడి అకౌంట్ నుండి భాస్కర్ మండల్ అనే వ్యక్తి అకౌంట్‌కు రూ. 12 లక్షలు, అవిజిత్ గిరి అకౌంట్‌కు రూ. 4.6 లక్షలు, మరో రెండు ఇతర అకౌంట్లకు రూ. 10 లక్షల చొప్పున మనీ ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించారు. ఝార్కండ్‌లోని జంతారా ప్రాంతం నుంచి ఈ మోసం జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. సిమ్ స్వాప్ టెక్నిక్ ద్వారా ఈ మోసానికి పాల్పడి ఉండొచ్చని పేర్కొంటున్నారు. అలాగే ఫోన్ హ్యాకింగ్ ఏమైనా జరిగిందా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.