రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేస్తున్నారట.! సెప్టెంబర్ 30వ తేదీ వరకూ ఆ నోట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇంతకీ, రెండు వేల రూపాయల నోట్లు ఎక్కడున్నాయ్.?
పెద్ద నోట్ల రద్దు సమయంలో రెండు వేల రూపాయల నోట్ల విషయమై నానా రకాల ప్రచారాలూ జరిగాయి. ఆ నోటులో చిప్పు పెట్టారనీ, పెద్ద సంఖ్యలో గనుక ఎవరైనా 2 వేల రూపాయల నోట్లను దాస్తే, ఆ చిప్స్ ద్వారా వాటిని కనిపెట్టేసి, పట్టేసుకుంటారనీ.. అబ్బో, బోల్డన్ని కథలు వినిపించాయి.
అయితే, అదంతా ఉత్త ప్రచారమనీ, ‘ఆరెంజ్ ఆర్మీ’ చేసిన చెత్త ప్రచారమనీ తర్వాత తేలింది. ఇంతకీ, ఆ రెండు వేల రూపాయల నోట్లు ఇప్పుడెక్కడ.? దేశంలో చాలామంది 2 వేల రూపాయల నోటు ఇటీవలి కాలంలో చూసింది లేదు. ఔను, 2 వేల రూపాయల నోటు ముద్రణ నిలిపివేశారు గతంలోనే.
కానీ, ఆ నోట్లు చెలామణీలోనే వున్నాయి. మరీ ముఖ్యంగా, రాజకీయ పార్టీల కనుసన్నల్లోనే ఈ 2 వేల రూపాయల నోట్లు చెలామణీ అవుతున్నాయి. దేశంలో ఎక్కడన్నా ఎన్నికలు జరుగుతోంటే, అక్కడ మాత్రమే ఎక్కువగా 2 వేల రూపాయల నోట్లు బయటకు వస్తున్నాయి. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇది వాస్తవం.
ఇప్పుడు ఆ 2 వేల రూపాయల నోట్లు రద్దు చేస్తున్నారు గనుక, పెద్ద మొత్తంలో వేర్వేరు చోట్ల వున్న ఆ నోట్లన్నీ బయటకు వస్తాయా.? రాజకీయ నాయకులు లేదా పార్టీలకు మేలు చేసేందుకే సెప్టెంబర్ వరకు ఆ నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించారా.?