2 వేల రూపాయల నోటు రద్దు: ఇంకా పెద్ద నోటు రాబోతోందా.?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న అతి చెత్త నిర్ణయం.. పెద్ద నోట్ల రద్దు.! దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోయింది. ఎన్నో ప్రాణాలు పోయాయి. కానీ, ఇంతవరకు ఆ పెద్ద నోట్ల రద్దు పాపానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి ఎలాంటి వివరణా ఇవ్వలేదు. ఇవ్వబోరు కూడా.!

పెద్ద నోట్ల రద్దుతో దేశం సరికొత్తగా పురోగమిస్తుందనీ, లక్షల కోట్ల నల్లధనం బయటకు వస్తుందని ప్రధాని మోడీ అండ్ టీమ్ చెప్పారు. అచ్చేదిన్ రాలేదు.. సచ్చేదిన్ అన్నట్టు తయారైంది సామాన్యుడి పరిస్థితి.

ఇప్పుడు ఇంకోసారి పెద్ద నోట్ల రద్దు అట.! ఈసారి 2 వేల రూపాయల నోటుని రద్దు చేస్తున్నారు. అంటే, ప్రస్తుతానికి చెలామణీలో వుండే అతి పెద్ద నోటు అంటే 500 రూపాయలు మాత్రమే.!

ఆగండాగండీ, వెయ్యి రూపాయల నోటుని రద్దు చేసి, రెండు వేల రూపాయల నోటుని తెచ్చిన ఘనుడు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ లెక్కన, 2 వేల రూపాయల నోటు రద్దయితే, ఐదు వేల రూపాయల నోటు అందుబాటులోకి రాబోతోందేమో.!

ప్రస్తుతానికైతే ఇంకా పెద్ద నోటు రావడంపై ఎలాంటి స్పష్టతా లేదు. 2024 ఎన్నికల్లో పంచడానికి తేలిగ్గా వుంటుందని, రాజకీయ పార్టీలకు వెసులుబాటు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం 5 వేల రూపాయల నోటుని తీసుకొస్తుందేమో.!

ఇలా జనం చర్చించుకుంటున్నారంటే, ఈ దుస్థితికి కారణం ఎవరు.? ఇంకెవ్వరు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే.!