చంద్రబాబుపై శివాజీ చెప్పిన కుట్ర ఇదేనా?

హీరో శివాజీ కొన్ని రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబుకు ఒక రాజ్యాంగ బద్ధ సంస్థ నుండి నోటీసులు అందబోతున్నాయి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా నిలిచాయి. వాటిపై చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బాబ్లీ కేసులో బాబుకు నోటీసులు జారీ అవడం అందరిని షాక్ కి గురి చేసింది.

బాబ్లీ కేసు మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రా ఈ మూడు రాష్ట్రాలకు ముడి పడి ఉంది. చంద్రబాబుపై మహారాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసులను అప్పట్లోనే ఉపసంహరించుకున్నట్లు మీడియాలో వార్తలు కూడా ప్రసారమయ్యాయి. అయితే తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు జరగనున్న సమయంలో టీడీపీ అధినేతకు బాబ్లీ కేసులో మళ్లీ నోటీసులు ఇవ్వడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశం అయింది.

కాగా హీరో శివాజీ కొన్ని రోజుల క్రితం ఆపరేషన్ గరుడ పేరిట పెద్ద కుట్ర జరుగుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ గరుడ ఒక నాటకమని, చంద్రబాబుకు కేంద్రం త్వరలోనే నోటీసులిస్తుందంటూ పేర్కొన్నారు. చంద్రబాబుని సీఎం పదవి నుండి దింపేందుకు బీజేపీ పెద్దలు కుట్ర చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. మొదటి నుండి ఏపీని ఇబ్బందులకు గురి చేస్తున్న మోడీ ప్రభత్వం ఆపరేషన్ గరుడను మరో రూపంలో అమలు చేయనుంది అని అన్నారు. ఇందులో భాగంగా చంద్రబాబుకు నోటీసులు అందనున్నట్టు స్పష్టమైన సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. నాలుగు రోజులు ఆలస్యమైనా చంద్రబాబుకి నోటీసులు పంపిస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలను బీజేపీ లీడర్లు తప్పుబట్టారు. శివాజీ చంద్రబాబు బినామీ అంటూ ఆరోపణలు కూడా చేశారు. కానీ ఇప్పుడు శివాజీ చెప్పినట్టే చంద్రబాబుకు బాబ్లీ కేసులో నోటీసులు రావడం విశేషం. ఇప్పుడు ఈ విషయంపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది.

చంద్రబాబు ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బాబ్లీ కేసును ఏదైనా కేంద్ర సంస్థకు అప్పగిస్తారేమో అనే చర్చలు కూడా రాజకీయ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. ఈ విషయంపై టీడీపీ ప్రభుత్వం న్యాయనిపుణుల నుండి సలహాలు తీసుకుంటోంది. కోర్టులోనే పోరాడతామంటూ, తమకు తప్పక న్యాయం జరుగుతుంది అంటూ టీడీపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగారు.