ఇంటి నుంచే ఓటు… 11 కేటగిరీల వారికి చోటు!

సాధారణంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోలింగ్ బూత్ ల వద్ద దివ్యాంగులు, పండు ముసలి వాళ్లూ ఇబ్బందులు పడుతూ వస్తుంటారు! దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే ఇకపై వారు ఇబ్బంది పడి పోలింగ్ బూత్ వరకూ రానవసరం లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు సుమారు 11 కేటగిరీల వారికి అవకాశం ఇచ్చింది.

త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోన్న నేపథ్యంలో… కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా… ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లు దాటినవారు ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ఎన్నికల అధికారులకు సమాచారం అందజేసింది.

ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సమాచారం అందిస్తూ.. ఇంటి నుంచే ఓటు వేయాలనుకునే వారు ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఈ సమయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులు ఎవరెవరు అనే విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారాన్ని పంపించింది.

ఇందులో భాగంగా… 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయం కల్పించింది. అదేవిధంగా కేంద్ర బలగాల్లో పనిచేస్తున్నవారు, ఎన్నికల విధుల్లో ఉండే వారు, పోలింగ్ ఏజెంట్లుగా పనిచేసేవారు, ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వారు సైతం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇలా మొత్తం 11 కేటగిరీల వారికి పోస్టల్ బ్యాలెట్ ఓటు అవకాశం కల్పించింది!

దీంతో… పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే వారు ముందుగా ఆ ప్రాంత ఎన్నికల అధికారికి రాత పూర్వకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తును పరిశీలించిన అనంతరం వారి ఇంటికి ఎన్నికల సంఘం అధికారులు వెళ్లి ఏర్పాట్లు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వచ్చే నెల ఓటర్ల జాబితాను విడుదల చేసిన తర్వాత అర్హులపై మరింత స్పష్టత ఇస్తారని అంటున్నారు!