ఇక్కడితో స్పష్టత వచ్చేసినట్లే.! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు ఆస్కారమే లేదు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది మార్చి – ఏప్రిల్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలతోపాటు, సార్వత్రిక ఎన్నికలూ జరుగుతాయి.
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముందస్తు ఎన్నికలపై వైసీపీ నేతలే, మీడియాకి లీకులు ఇస్తూ వచ్చారు. అయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజా ఢిల్లీ పర్యటన తర్వాత, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల్లేవని స్పష్టత వచ్చేసింది.
వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన వైఎస్ జగన్, వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనీ, అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంటు ఎన్నికలూ జరుగుతాయని స్పష్టతనిచ్చారు.
ప్రస్తుతం అక్టోబర్ నడుస్తోంది.! నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి.. అంటే, పూర్తిగా ఐదు నెలల సమయం మాత్రమే వుందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి.
తెలంగాణలో మాత్రం, ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజు సాయంత్రమే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి స్పష్టత రాబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, ఈ మేరకు ఈరోజు మీడియా సమావేశంలో షెడ్యూల్ ప్రకటించనున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాల అమలుకు ఈ ఐదు నెలల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామంటోంది వైసీపీ. ప్రజలకు మరింత చేరువయ్యేందుకూ ఈ ఐదు నెలల సమయం తమకు ఉపకరిస్తుందన్న భావనలో వైసీపీ వుంది.