కాలుష్య కంపెనీలపై వెలిమినేడు కన్నెర్ర, టెన్షన్

పోలీసు బూటు చప్పుళ్లు.. సైరన్  మోతలు, చేతిలో లాఠీలు… అడుగడుగునా పోలీస్ బందోబస్తు… ప్రశ్నిస్తే గొంతునొక్కేసే ప్రయత్నాలు… అధికారుల కుమ్మక్కు… అమ్ముడు పోయిన కొందరు కంపెనీ తొత్తులు… పరాయి వాళ్లమైనట్టు నెట్టి వేసుడు… ఎంతటి అరాచకం.. దాష్టికం.. కుట్రలు, కుతంత్రాలు… ఇన్నీ ఉన్నా అవేమి వెలిమినేడు గ్రామస్థులను ఏం చేయలేకపోయాయని కంపెనీలకు వ్యతిరేక గళం వినిపించి విజయవంతం అయ్యామని పలువురు గ్రామస్థులు తెలిపారు.

పూల దండలు ఉన్నాయి… చెప్పుల దండలు ఉన్నాయి… పూల దండలు కావాల్నా.. చెప్పుల దండలు కావాల్నా అంటూ హెచ్చరించారు. గ్రామస్థులమంతా ఏకమైనం జెండాలను పక్కకు పెట్టి ఏజెండాతో ముందుకు వచ్చినం.. నల్లగొండ జిల్లా… పోరాటాల ఖిల్లా… నిజాం నవాబును తరిమి కొట్టిన వీరులు ఉన్న జిల్లాల పుట్టినోళ్లం పోరాటాలకు పుట్టినిళ్లు ఈ వెలిమినేడు.. అవసరమైతే ప్రాణాలొదలడానికైనా సిద్దంగా ఉన్నాం… మీరున్నారా అంటూ ప్రశ్నించారు. ఆద్యంతం ఉద్రిక్తంగా, ఉద్వేగంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ముక్తకంఠంతో కంపెనీలు వద్దురా… అంటూ నినదించారు.

ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత

హెటిరో, దశమి పరిశ్రమల విస్తరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం నాడు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. నల్లగొండ జిల్లా జేసీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. కొంత మంది కంపెనీకి అనుకూలంగా మాట్లాడటంతో సభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. గ్రామస్థులకు, కంపెనీలకు అనుకూలంగా మాట్లాడిన వారికి పంచాయతీ జరిగింది.  ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన విద్యార్ధులను పోలీసులు అడ్డుకున్నారు.

చాలా మంది ఊళ్ల ఉండనోళ్లు వచ్చి కంపెనీలు కావాలంటున్నరు. మీరు ఈడ ఉంటే మా బాధ తెలుస్తదిర భై అంటూ గ్రామస్థులు ప్రశ్నించారు. కంపెనీల వల్ల వచ్చే కంపు మా బతుకులు ఆగం చేస్తుందని ఎట్టి పరిస్థితిలో కంపెనీలకు అనుమతిచ్చేదే లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది కంపెనీల తొత్తులుగా వ్యవహరించి వారిచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి అనుకూలంగా మాట్లాడారని అంటువంటి వారికి ఖబడ్డార్ అంటూ పలువురు హెచ్చరించారు.

ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు

ఊరు వల్లకాడు కాకముందే మేల్కొనాల్సిన అవసరముందని గ్రామాన్ని పచ్చగా ఉంచుకుందామా లేక నాశనం చేసుకుందామా అనుకూలురను పలువురు ప్రశ్నించారు. గ్రామంలో అనేక మంది ఇబ్బందులు పడుతున్నామని గ్రామసభలు, అఖిల పక్ష పార్టీలు, మహిళా సంఘాలు, ఉపాధ్యాయులు, మేధావులు, విద్యార్దులు, మహిళా సంఘాలు, కార్మికులు, కర్షకులు ఇంత మంది ఏకమై చెబుతున్నాం బిడ్డా… కంపెనీలను విస్తరిస్తే ఖబడ్ధార్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

 

veliminedu protest

పలువురు ఉపాధ్యాయులు. మేధావులు, విద్యార్ధులు, మహిళలు, యువకులు తమ అభిప్రాయం వెల్లడించారు. 54 మంది మాట్లాడగా అందులో 50 మంది కంపెనీకి వ్యతిరేకంగా, 4గురు కంపెనీకి అనుకూలంగా మాట్లాడినట్టు జెసి తెలిపారు. ప్రతి ఒక్క అంశాన్ని రికార్డు చేశామని పర్యావరణ, కాలుష్య మండలికి సమర్పించిన తర్వాత వారి అనుమతి మేరకు అనుమతులు ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని తెలియపరుస్తామన్నారు. నిబందనలకు అనుకూలంగానే కంపెనీనీ  విస్తరిస్తమని, స్థానికులకే ఉద్యోగాలిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పగా గ్రామస్థులు దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఉదయం ప్రారంభమైన అభిప్రాయ సేకరణ రాత్రి వరకు కొనసాగింది. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులకు గ్రామస్థులంతా ధన్యవాదాలు తెలిపారు.

అర్ధరాత్రి వరకు సభలోనే వేచి ఉన్న బొంతల చంద్రారెడ్డి, గ్రామ పెద్దలు