జనవరి 16వ తేదీ నుండి ప్రారంభం కానున్న దేశవ్యాప్త కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ లో మొదటిరోజు సుమారు మూడు లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ షాట్లు ఇవ్వనున్నట్లు గా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కరోనా మహమ్మారి నివారణకు రెండు టీకాలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు సరఫరా అయ్యాయి. అత్యంత భద్రత నడుమ కొవిడ్ టీకాను ఆయా రాష్ర్టాలకు తరలించారు.
ఈ క్రమంలో రేపు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. శనివారం ఉదయం 10:30 గంటలకు వర్చువల్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించనున్నారు. దేశ వ్యాప్తంగా 3,006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆరంభం కానుంది. తొలి రోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి ప్రభుత్వం టీకాలు ఇవ్వనుంది. తొలిదశలో ప్రభుత్వ, ప్రయివేటు ఆరోగ్య, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
కొ-విన్ యాప్ ద్వారా దేశ వ్యాప్తంగా జరిగే కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను పరిశీలించనున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు ఆన్‌లైన్‌లో పర్యవేక్షించనున్నారు. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కోసం ప్రత్యేక కాల్ సెంటర్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక కాల్ సెంటర్ టోల్‌ఫ్రీ నంబర్ – 1075. క్షేత్రస్థాయి సిబ్బంది సందేహాలను అధికారులు నివృత్తి చేయనున్నారు.