టివి ప్రేక్షకులకు ట్రాయ్ శుభవార్త చెప్పింది. కొత్త టారిఫ్ విధానం ప్రకారం చానళ్లు ఎంచుకునే గడువు మార్చి 31 వరకు పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు జనవరి 31 తోనే ముగిసింది. కానీ చానళ్లు ఎంపిక చేసుకోవడంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవడంతో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ గడువును పొడిగిస్తూ ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. కేబుల్ ఆపరేటర్లు దీని పై వినియోగదారులకు అవగాహన కల్పించకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తినట్టు ట్రాయ్ పేర్కొంది.
ట్రాయ్ నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా 10 కోట్ల కేబుల్ సర్వీసులు, 6.7 కోట్ల డిటిహెచ్ సర్వీసులు ఉన్నాయి. బెస్ట్ ఫిట్ ప్లాన్ కింద వినియోగదారులు తమకు నచ్చిన చానళ్లను ఎంపిక చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు ట్రాయ్ తెలిపింది. పొడిగించిన గడువులోగా బెస్ట్ ఫిట్ ప్లాన్ ను ఎంపిక చేసుకోవాలని కోరింది. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు తాము చూసే చానళ్లకు మాత్రమే ధర చెల్లించాల్సి ఉంటుంది. ట్రాయ్ గడువు పొడిగించడంతో వినియోగదారులకు ఉపశమనం కలిగింది.