ప్రస్తుతం చల్లని, తడి వాతావరణంలో హానికరి బ్యాక్టీరియా, వైరస్ లు త్వరగా వృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సున్నితమైన మన కళ్ళను రక్షించుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కంటి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న గాలి, నీరు కాలుష్యానికి తోడు చల్లటి వాతావరణం కారణంగా మన కళ్ళకు హాని చేసే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు అయినా కళ్ళ కలక, కళ్ళు ఎర్రబడడం, కంటి వాపు, కంటి నుంచి నీరు కారణం వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తోంది. ఇలాంటి కంటి సమస్యలతో బాధపడేవారు ఇతరులకు భౌతిక దూరం పాటించడం మంచిది.
ఇంకా ఈ సీజన్లో వచ్చే జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా కళ్లకు వచ్చే అలర్జీ లక్షణాలు మన కంటికి హాని కలిగిస్తాయి. కావున మన కంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, గుడ్లు ,చేప ప్రతిరోజు ఆహారంలో ఉన్నట్లు చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంతో పాటు విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉండే క్యారెట్ ,బీట్రూట్, నారింజ ,బత్తాయి, ద్రాక్ష జ్యూసులను అదనంగా మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి ఆరోగ్యాన్ని రక్షించడంతోపాటు వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.సీజనల్గా వచ్చే కంటి సమస్యలకు చెక్ పెట్టడానికి క్రమం తప్పకుండా చేపలను ఆహారంగా తీసుకున్నట్లయితే వీటిలో ఉండే విటమిన్ ఏ, ఒమేగా-3 ఫాటీ ఆమ్లం పొడి బారిన కళ్ళ సమస్యను తగ్గించి రెటీనా పనితీరును మెరుగుపరుస్తుంది.
చాలామంది ఎక్కువ సమయాన్ని కంప్యూటర్, టీవీ ముందు గడపడం, అర్ధరాత్రి వరకు సెల్‌ఫోన్‌లకు అతుక్కుపోవడం వల్ల ఎన్నో కంటి సమస్యలు వస్తుంటాయి. కళ్లు ఎరుపెక్కడం, కంటి నుంచి నీరు కారడం, దురదలు పెట్టడంతో పాటు చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు మొబైల్, టీవీలు చూడడం తగ్గించాలి.కళ్ళు సున్నితమైన అవయవాలు కాబట్టి తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడేవారు సొంత వైద్యంతో కాలవ్యాపన చేయకుండా వెంటనే కంటి వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.