తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తరహాలోనే డిఎంకే అధినేత కరుణానిధిని ఖననం చేయనున్నారు. జయలలిత మృతి చెందిన సమయంలో ఆమెను దహనం చేయకుండా ఖననం ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న అందరికి వచ్చింది. దానికి మద్రాసు యూనివర్సిటికి చెందిన తమిళ ప్రొఫెసర్ డాక్టర్ వి. అరుసు ఓ వివరణ ఇచ్చారు.
ద్రవిడ ఉద్యమంలో పాల్గొనడం వల్లనే జయలలితను దహనం చేయకుండా ఖననం చేశారని తెలిపారు. హిందూ సాంప్రదాయాలు, బ్రాహ్మణ పద్దతులను ద్రవిడ ఉద్యమకారులు నమ్మరు. జయలలిత, కరుణానిధి ఆ ఉద్యమంలో పాల్గొన్నవారు కాబట్టి వారిని దహనం చేయడం లేదని చెప్పారు. జయలలిత కూడా ద్రవిడ పార్టీ నాయకురాలే. కరుణానిధి ఎప్పటి నుంచో ద్రవిడ ఉద్యమంలో భాగస్వామ్యులై ఉన్నారు. అందుకే జయలలిత మాదిరిగా కరుణను కూడా ఖననం చేయనున్నారు. ద్రవిడ ఉద్యమకారులు హిందూ ఆచారాలు, పద్దతులనే కాకుండా కులాన్ని సూచించే పేర్లను కూడా పెట్టుకోరని అరుసు అన్నారు.
జయలలిత కంటే ముందు ఎంజీ రామచంద్రన్ ను కూడా ఖననం చేశారు. డిఎంకే స్థాపకుడు, ద్రవిడ ఉద్యమ నేత అన్నాదురై సమాధి సమీపంలోనే వీరిద్దరి సమాధులున్నాయి. ఎంజీఆర్ మొదట్లో డిఎంకేలో ఉండేవారు. అన్నాదురై మృతి తర్వాత కరుణానిధి పార్టీ పగ్గాలను చేపట్టారు. ఈ తర్వాత కొన్నాళ్లకే ఎంజీఆర్, కరుణానిధిల మధ్య విబేధాలొచ్చాయి. దీంతో ఎంజీఆర్ డిఎంకే నుంచి విడిపోయి అన్నాడిఎంకే పార్టీని స్థాపించారు. మరో వైపు కరుణానిధి మృతదేహాన్ని మెరీనా బీచ్ లో ఖననం చేయాలని డిఎంకే డిమాండ్ చేయగా దానికి ప్రభుత్వం నిరాకరించింది. చివరకు విషయం హైకోర్టుకు చేరడంతో కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్ లో జరపవచ్చని తీర్పునిచ్చింది.