పెళ్లై నాలుగు రోజులే అయ్యింది. ఆ కొత్త జంట ముచ్చట తీరలేదు. వచ్చిన బంధువులు పెళ్లి ఉత్పవాలలోనే ఉన్నారు. కానీ ఇంతలో ఆ పెళ్లి కొడుకుకు వెంటనే వచ్చి విధుల్లో చేరాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో అతను ఏ మాత్రం ఆలోచించకుండా దేశ రక్షణ కోసం బయల్దేరి వెళ్లారు.
కర్ణాటక రాష్ట్రం చిక్కోడి జిల్లా మలికవాడ గ్రామానికి చెందిన రాజేంద్ర సుతార ఇండియన్ ఎయిర్ ఫోర్సులో ఎయిర్ మన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవలే వివాహం చేసుకునేందుకు సెలవు పై వచ్చాడు. ఫిబ్రవరి 24న అదే ప్రాంతానికి చెందిన మాధురితో అతనికి వివాహం జరిగింది. భారత్ పాక్ సరిహద్దులో నెలకొన్న పరిస్థితులతో వెంటనే వచ్చి విధుల్లో చేరాలని ఆదేశాలు వచ్చాయి. దేశ రక్షణ కోసం బయల్దేరిన ఆ నవ వరుడికి నవ వధువు వీర తిలకం దిద్ది పంపించింది. అక్కడి లోకల్ అధికారులు, ప్రజలు అతనికి అభినందనలు తెలియజేస్తూ వీడ్కోలు పలికారు.