విషాదంతో ముగిసిన పెళ్లి వేడుక.. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఐదుగురు సజీవ దహనం..?

కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఎంతో సంతోషంగా జరగాల్సిన పెళ్లి వేడుక విషాదంతో ముగిసింది. పెళ్లి వేడుకలలో కొన్ని సందర్భాలలో అనుకొని ఈ ఇటువంటి ప్రమాదాల వల్ల తీవ్ర విషాదం మిగులుతోంది. తాజాగా రాజస్థాన్ లో ఓ పెళ్లి వేడుకలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్లోని జోధ్ పూర్ లో పెళ్లి వేడుకలు జరుగుతున్న సమయంలో గ్యాస్ సిలిండర్ పేరు పెళ్లికి హాజరైన ఐదుగురు బంధువులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. ఎంత సంబరం గా సాగిపోవాల్సిన ఈ పెళ్లి వేడుక ఇలా విషాదంతో ముగిసింది.

వివరాలలోకి వెళితే…జోధ్ పూర్ లోని భుంగా గ్రామంలో గురువారం జరిగిన ఒక పెళ్లి వేడుకలో వంటకు ఉపయోగించిన గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తు పేలి భారీ మంటలు చెలరేగాయి. ఇలా అకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగటంతో పెళ్లికి హాజరైన వారందరూ భయాందోళనలకు గురయ్యారు. మంటలు చెలరేగి పెళ్లి కోసం వేసిన టెంట్ కి మంటలు అంటుకోవటంతో అక్కడ ఉన్న వారందరూ భయంతో పరుగులు తీశారు. అయితే ఈ క్రమంలో వ్యక్తులందరూ ఒకరినొకరు తోసుకోవడంతో ఐదుగురు వ్యక్తులు మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయ్యారు.

ఈ దుర్ఘటనలో మరొక 12 మంది వ్యక్తులు తీవ్రంగా గాయపడగా.. 50 మందికి పైగా స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా ఈ అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని ఎంతో శ్రమించి మంటలు ఆర్పేశారు. ఇలా శుభకార్యం జరుగుతున్న సమయంలో మంటలు చెలరేగి 5 మంది మృత్యువాత పడటంతో పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి గల కారణాల గురించి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ హిమాన్షు గుప్తా క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించాడు. ఇక ఈ ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలియజేశాడు.