పిల్లలకి మంచి చదువు చెప్పి వారిని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడం ఉపాధ్యాయుడి యొక్క లక్షణం. అయితే ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి తల్లి మీద కక్ష్య పెంచుకొని బాలుడిని విచక్షణారహితంగా కొట్టడంతో బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
గదగ్ జిల్లా ఎస్పీ శివ ప్రకాష్ దేవరాజ్ తెలిపిన వివరాల మేరకు..ఈ ఘటన గదగ్ జిల్లా నరగుంద తాలూక హద్లి గ్రామంలో జరిగింది. హద్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ముత్తప్ప అనే వ్యక్తి అతిధి ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. ఇదే పాఠశాలలో గీత అనే మహిళ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తోంది. ఆమె కుమారుడు భరత్ ఇదే పాఠశాలలో చదువుతున్నాడు.
ఒకే పాఠశాలలో కలిసి పని చేస్తుండడంతో గీత, ముత్తప్పలకు పరిచయం ఏర్పడింది. వీరిరువురు సన్నిహితంగా మెలిగేవారు. ఈ క్రమంలో విద్యార్థులను విహారయాత్రలకు తీసుకువెళ్లిన సమయంలో గీత మరొక ఉపాధ్యాయుడితో సన్నిహితంగా మెలగడం చూసిన ముత్తప్ప కోపోద్రిక్తుడయ్యాడు. ఆమె మీద కోపంతో ఈ నెల 19వ తారీఖున భరత్ ను ఊరి బయటకు తీసుకెళ్లిన ముత్తప్ప బాలుడిని విచక్షణ రహితంగా కొట్టాడు. విషయం తెలిసిన బాలుడి తల్లి గీత ముత్తప్పను నిలదీయగా, ఆమె మీద కూడా దాడి చేశాడు.
తీవ్ర గాయాలు పాలైన ఇద్దరిని స్ధానికులు ఆసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం భరత్ మృతి చెందాడు. అయితే ప్రస్తుతం గీత ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ పాఠశాలకు పంపడానికి భయపడుతున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ముత్తప్ప ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.