ఈ ఆధునిక కాలంలో బాలికలు, యువతులు, మహిళలు అనే తేడా లేకుండా ఆడవారి మీద కామాంధుల అరాచకాలు రోజు రోజుకి మితి మీరి పోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా.. కొందరు నీచుల కారణంగా మహిళలు ఎప్పుడు సమస్యలు పడుతుంటారు. యువతులను తమ దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నించడం కుదరకపోతే వారి మీద దాడులు చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలను అరికట్టడానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇటువంటి అరాచకాలు మాత్రం ఆగటం లేదు.
ఎంతో డెవలప్ అయిన దేశ రాజధానిలో ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతుంటాయి. అయితే ఇక్కడ ఒక దుకాణదారుడు చేసిన పని వలన ఒక అమ్మాయి ప్రాణం పోకుండా కాపాడగలిగాడు. తన వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చిన అమ్మాయి మీద ఒక బకెట్ నీరు చెల్లి ఆ అమ్మాయిని ప్రాణాపాయం నుండి తప్పించగలిగాడు.
వివరాల్లోకి వెళితే…దేశ రాజధాని ఢిల్లీ లోని ద్వారకలో ఒక వ్యక్తి దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఒక యువతి తన ముఖానికి చేతులు అడ్డుపెట్టుకొని పరిగెత్తుకుంటూ దుకాణదారుడి దగ్గరకు వచ్చింది. ఆమె కంగారు పడటం గమనించిన దుకానదారుడుకి మొదటగా ఏమీ అర్థం కాలేదు. కాసేపటికి ఆమెపై యాసిడ్ దాడి జరిగి ఉండవచ్చు అని అనుమానించిన దుకాణదారుడు వెంటనే పక్కనే ఉన్న బకెట్ తీసుకొని ఆమె ముఖం మీద చల్లాడు.
దీంతో యువతికి వేడి నుండి ఉపశమనం కలిగింది. వెంటనే సదరు యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువతకి ఎనిమిది శాతం గాయాలు అయినట్టు డాక్టర్లు తెలిపారు. సమయానికి దుకాణదారుడు స్పందించి యువతిని ప్రాణాపాయ స్థితికి వెళ్లకుండా కాపాడాడు. ఇదిలా ఉండగా ఆమెపై ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేసినట్టు స్థానికులు పోలీసులకు తెలిపారు. యువతి మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో దాడి చేసినవారు ఎవరనేది ఇంకా తెలియ రాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.