కేరళలో టెన్షన్… టెన్షన్

శబరిమలలో ఇద్దరు మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు చేపట్టిన బంద్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. హిందూ సంఘాల కార్యకర్తలు పలు చోట్ల విధ్వంసం సృష్టించారు. పోలీసు వాహనాలు, 80 బస్సులను ధ్వంసం చేశారు. 40 మంది పోలీసుల పై దాడికి పాల్పడ్డారు. పలువురు మహిళా జర్నలిస్టుల పై కూడా ఆందోళన కారులు దాడులు చేశారు.

దీంతో శబరిమలతో పాటు కేరళ అంతా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అదనపు బలగాలతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చెన్నై, బెంగూళూరులలోని కేరళ ప్రభుత్వ ఆఫీసుల పై కూడా ఆందోళనకారులు దాడులు చేశారు.

కేరళలో బంద్ పై సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే

“శబరిమలలోకి మహిళలు ప్రవేశించారని హిందూ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. దీని అర్ధం సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకించడమే. సుప్రీం తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. శబరిమలకు వచ్చే మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది.  సుప్రీం తీర్పుతో బిందు, కనకదుర్గ దర్శనం చేసుకున్నారు. వారిని ఎవరూ ఆపలేదు. మీడియాలో వచ్చిన తర్వాతనే ఆందోళనలు మొదలయ్యాయి. బిజెపి, ఆర్ఎస్ ఎస్ కావాలనే ఆందోళన చేస్తున్నాయి. కేరళను రణరంగంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.” అని విజయన్ అన్నారు. 

కేరళలో మాత్రం పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. శబరిమలలో నెలకొన్న వివాదాలు పరిష్కరించాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు జనవరి 22కు వాయిదా వేసింది. మహిళలు ఆలయంలోకి ప్రవేశించారని ఆలయం శుద్ది చేయడం సుప్రీం తీర్పును వ్యతిరేకించడమేనని ఆలయ పూజారి పై కేరళ న్యాయవాది సుప్రీంలో మరో పిటిషన్ వేశారు.