అయిపాయె.! టీడీపీ మద్దతు కూడా బీజేపీకే.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక్క ‘పవర్ సెంటర్’ వుంది. అది బీజేపీ మాత్రమే.! ఆ మధ్య ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో ఓ రాజకీయ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్య ఇది.

బీజేపీని ఎదిరించేంత సీన్ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో దేనికీ లేదన్నది ఆ రాజకీయ విశ్లేషకుడి వాదన. సరే, ఆ వాదనలో నిజమెంత.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయనుకోండి.. అది వేరే సంగతి.

రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి వైసీపీ, కేంద్రం ముందర ప్రత్యేక హోదా డిమాండ్ వుంచాలంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన చాలామంది నేతలు నానా యాగీ చేశారు.  కానీ, చివరికి ఏమయ్యింది.? తెలుగుదేశం పార్టీ కూడా, నిస్సంకోచంగా బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్ధి ద్రౌపది ముర్ముకి మద్దతు ప్రకటించేసింది.

అందరకన్నా ముందుగా వైసీపీనే ద్రౌపది ముర్ముకి మద్దతు ప్రకటించిన విషయం విదితమే. బీజేపీ అడక్కుండానే వైసీపీ, ద్రౌపది ముర్ముకి మద్దతు ఇచ్చేసిందని సాక్షాత్తూ బీజేపీ నేత సత్యకుమార్ విమర్శిస్తే, తాజాగా ఆ వ్యాఖ్యల్ని బీజేపీ అధిష్టానం ఖండించిందనుకోండి.. అది వేరే సంగతి.

ఇంతకీ, ప్రత్యేక హోదా డిమాండ్ చేయకుండా, టీడీపీ ఎందుకు ద్రౌపది ముర్ముకి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చినట్లు.? ఈ విషయమై టీడీపీ మీద బోల్డన్ని సెటైర్లు పడుతున్నాయి వైసీపీ నుంచి. వైసీనీ మీద టీడీపీ కౌంటర్ ఎటాక్ సంగతి సరే సరి.

ఎలా చూసినా, బీజేపీ ఏం చేసినా, రాష్ట్రంలో ఎవ్వరూ వ్యతిరేకించే పరిస్థితి లేదని తేలిపోయింది. జనసేన ఎలాగూ బీజేపీ మిత్రపక్షమే. అంశాల వారీగా వైసీపీ, బీజేపీకి మద్దతిస్తోంది. టీడీపీకి వేరే దారి లేక బీజేపీతో ఇలా సఖ్యత కొనసాగిస్తోందన్నమాట.