వాజ్ పేయి మరణం మీద శివసేన నేత వివాదం

భారతదేశ ముద్దు బిడ్డ వాజ్ పేయి చనిపోయి 10 రోజులయింది. ఆగస్టు 16వ తేదీ సాయంత్రం ఆయన మరణించినట్లు ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఆయన అంత్యక్రియలు జరిగిపోయాయి. మరణానికి ముందే ఆయనకు భారతరత్న గౌరవం దక్కింది. గత కొంత కాలంగా వాజ్ పేయి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు.

రెండు నెలల నుంచి ఆయన ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఉండి ఆగస్టు 16వ తేదీన తుది శ్వాస విడిచారు. ఈ ముచ్చటే ప్రపంచానికి తెలుసు. తెర మీద ఈ విషయాలు వాస్తవం కాదని, తెర వెనుక వేరే విషయాలు ఉన్నాయని శివసేన వివాదం పుట్టించింది. ఇంతకూ శివసేన చేస్తున్న ఆరోపణలు ఏంటి? ఆ వివరాల కోసం కింద చదవండి.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మరణించిన తేదీని వివాదంలోకి గుంజారు శివసేన పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ రావుత్. వాజ్ పేయి మరణించిన సమయాన్ని ప్రధాని మోదీ తనకు అనుకూలంగా మార్చారని శివసేన నేత సంజయ్ విమర్శలు చేశారు. ఆగస్టు 16వ తేదీన వాజ్ పేయి మరణించారు. కానీ అంతకుముందే ఆయన మరణించినా ప్రధాని మోదీ ఆ విషయం వెల్లడించకుండా పెండింగ్ లో ఉంచారన్నది సంజయ్ విమర్శ.

దానికి కూడా సంజయ్ ఆసక్తికరమైన విషయాన్ని లేవనెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని హోదాలో పంద్రాగస్టు నాడు ఎర్రకోట మీద నుంచి ప్రసంగం చేయడం కోసమే వాజ్ పేయి మరణాన్ని ఆలస్యంగా ప్రకటించారని అనుమానాన్ని వ్యక్తం చేశారు సంజయ్. ఈ సందేహాలు వ్యక్తం చేస్తూ సంజయ్ శివసేన పత్రిక సామ్నా లో ఒక ఆర్టికల్ రాశారు కూడా. ఇప్పుడు ఆ ఆర్టికల్ తెగ వైరల్ అవుతోంది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది.

ఆగస్టు 12వ తేదీనుంచే వాజ్ పేయి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చిందని సంజయ్ వెల్లడించారు. స్వాతంత్ర దినోత్సవం నాడు జాతీయ సంతాపం, జాతీయ జెండా అవనతం లాంటి వాటిని తప్పించేందుకే ప్రధాని వాజ్ పేయి మరణంపై ప్రకటనను ఆలస్యం చేశారన్నది ఆయన చెబుతున్నమాట. దాంతోపాటు ఎర్రకోట నుంచి మోదీ సుదీర్ఘ ఉపన్యాసం కోసమే ఇటువంటి పనిచేశారన్న అనుమానాన్ని సంజయ్ వ్యక్తం చేశారు.