సుప్రీం కోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గోగోయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. గోగోయ్ చేత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ దీపక్ మిశ్రా నుంచి గోగోయ్ బాధ్యతలు స్వీకరించారు.
సీనియర్ న్యాయవాది అయిన గోగోయ్ 13నెలల పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు. ఈశాన్యం నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి సీజేఐగా గోగోయ్ చరిత్ర సృష్టించారు. రాష్ట్రపతిభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితరులు పాల్గొన్నారు.
అస్సాం మాజీ ముఖ్యమంత్రి కేశవ్ చంద్ర గొగోయ్ కుమారుడైన రంజన్ గొగోయ్ దిబ్రూగఢ్‌లో 1954 నవంబర్ 18వ తేదీన జన్మించారు. ఢిల్లీ వర్సిటీలో న్యాయవిద్యను అభ్యసించారు. 1978లో బార్ అసోసియేషన్‌ల్ చేరారు. 1978లో న్యాయవాదిగా చేరి గువాహటి హైకోర్టులో ఎక్కువ కాలం పనిచేశారు. 2001 ఫిబ్రవరి 28న గువాహటి హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
2010 సెప్టెంబర్ 9న పంజాబ్ – హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2011 ఫిబ్రవరి 12న ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2012 ఏప్రిల్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
రంజన్ గోగోయ్ కి స్వంత ఇల్లు కూడా లేదు. అసోం మాజీ సీఎం కేశవ్ చంద్ర గొగోయ్ కుమారుడైన రంజన్ గొగోయ్‌కు సొంత వ్యక్తిగత వాహనం లేకపోవడం గమనార్హం. ఆయన పేరుతో ఎలాంటి బ్యాంకు రుణాలు కూడా లేవు. సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ఆస్తుల వివరాల ప్రకారం జస్టిస్ గొగోయ్‌కు రెండు బ్యాంకు ఖాతాల్లో రూ 6.5 లక్షల నగదు నిల్వలు, రూ 16 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు, 1999లో తీసుకున్న రూ 5 లక్షల విలువైన ఎల్‌ఐసీ పాలసీలున్నాయి. ఆయనకు ఎలాంటి బంగారు ఆభరణాలు లేకున్నా భార్య పేరిట 150 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి.