జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలలో చాలా మార్పులు వచ్చాయి. కొద్ది కాలం క్రితం కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ అనే పార్టీని స్థాపించి వచ్చే ఏడాది జరగనున్న ఎలక్షన్స్‌లో పోటీ చేసేందుకు సిద్దం కాగా, ఇప్పుడు రజనీకాంత్ కూడా సమరంలో నిలిచేందుకు సిద్ధమయ్యాడు. కొద్ది రోజుల క్రితం తన ట్విట్టర్ ద్వారా పార్టీ పెట్టబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించిన తలైవా డిసెంబర్ 31న పార్టీ ప్రకటన ఉంటుంది, జనవరిలో పార్టీ లాంచ్ జరుగుతుందని తెలియజేశారు. రజనీకాంత్ రాజకీయాలలోకి వస్తున్నారని ప్రకటించిన వెంటనే అభిమానులలో ఆనందం అవధులు దాటింది.
ప్రస్తుతం రజనీకాంత్ తన తాజా చిత్రం అన్నాత్తె షూటింగ్‌తో బిజీగా ఉంటూనే మరోవైపు పార్టీకి సంబంధించిన పనులు చూసుకుంటున్నారు. డిసెంబర్ 31న ప్రకటించనున్న పార్టీకి చీఫ్ కోఆర్డినేటర్‌గా అర్జున మూర్తిని, సూపర్‌వైజర్‌గా తమిళ్రూవి మణియనణ్‌ను నియమించారు. ఇక పార్టీ పేరు, జెండా , గుర్తు తదితర విషయాలపై కొద్ది రోజులుగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో కొత్త పార్టీకి ‘మక్కల్ సేవై కర్చీ'( ప్రజాసేవ పార్టీ ) అనే పేరు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.అలాగే పార్టీకి ఆటో గుర్తును ఎలక్షన్ కమిషన్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.
పాల క్యాన్, సైకిల్‌తో కూడిన గుర్తు ఉంటుందని ప్రచారం జరిగిన, ఆటో సింబల్ వైపే అతను మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ భాషా చిత్రంలో ఆటోడ్రైవర్‌గా కనిపించి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో రజినీకాంత్ పార్టీ ‘మక్కల్ సేవై కర్చీ’ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. తాను పార్టీ అధ్యక్షుడిగా ఉండి మరో వ్యక్తిని సీఎంని చేస్తానని రజనీకాంత్ అంటున్నప్పటికీ, తమ అభిమాన హీరోని సీఎం చూడాలని అభిమానులు కోరుతున్నారు. మరి రానున్న రోజులలో ఏం జరుగుతుందో చూడాలి. కాగా, రజనీ తన పార్టీకు ‘బాబా లోగో’ను కోరగా.. దాన్ని కేటాయించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది.