రాహుల్ పప్పు అన్నారు.. కానీ బిజెపి తుప్పు లేపిండుగా

రాహుల్ గాంధీ ముద్దపప్పు.. రాహుల్ పప్పు.. గూగుల్ లో పప్పు అని టైప్ చేస్తే వచ్చే పేరు రాహుల్ గాంధీ.. ఇదంతా నిన్నమొన్నటి వరకు రాహుల్ గాంధీ మీద ప్రత్యర్థులు చేసిన వ్యంగ్య విమర్శలు. రాహుల్ ను నవ్వులపాలు చేసేందుకు అపోజిషన్ పార్టీ చేసిన ప్రయత్నాలు. కానీ శుక్రవారం లోక్ సభలో జరిగిన అవిశ్వాసం చర్చ సందర్భంగా రాహుల్ చేసిన ప్రసంగం చూసిన వారెవరైనా రాహుల్ పప్పు.. ముద్ద పప్పు అంటే ఒప్పుకోరు. ఎందుకంటే రాహుల్ అరగంట పాటు రాహుల్ గాంధీ చెలరేగిపోయారు. పదునైన పదాలతో, మాటల తూటాలు పేల్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి నేరుగా, సూటిగా విమర్శలు చేశారు. రాహుల్ ప్రసంగం జరుగుతున్నంతసేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నవ్వుతూ కనిపించారు. కానీ ఆ నవ్వులో మాత్రం స్వచ్ఛత లేదన్నది తేలిపోయింది. కొనితెచ్చిపెట్టుకున్న నవ్వులా ఉందని చెప్పవచ్చు.

ప్రధాని నవ్వుతున్న సందర్భంలో కూడా రాహుల్ తొనకకుండా బెనకకుండా విమర్శలు గుప్పించారు. నవ్వు మీద కూడా సెటైర్ వేశారు. మీ మొహం మీదే నవ్వు ఉంది తప్ప జనాల్లో లేదంటూ రాహుల్ వ్యంగ్య బాణాలు వదిలారు. దీంతో రాహుల్ ప్రసంగం జరుగుతున్నంత సేపు ప్రధాని నవ్వులో మాత్రం స్వచ్ఛత కోల్పోయింది. ప్రధాని నా కళ్లలోకి సూటిగా కూడా చూసి మాట్లాడలేని పరిస్థితిలోకి నెట్టబడ్డారు. ఆయనకు ఆ ధైర్యం లేదు. నా ప్రశ్నలు ప్రధానమంత్రి మోడీని భయపెడుతున్నాయి. దేశానికి సైనికుడిగా ఉంటానన్న మోడీ నిజంగా అలా చేసి ఉంటే అమిత్ షా కొడుకు చేసిన కుంభకోణాలపై ఎందుకు నిగ్గు తేల్చరు అని ప్రశ్నించారు. ఒకవైపు చైనాతో మన సైనికులు పోరాటం చేస్తుంటే మోదీ మాత్రం ఆ దేశాధ్యక్షుడితో పడవ షికారు చేయడం ఎంతవరకు కరెక్టు అని నిలదీశారు.

ఇక రఫెల్ ఒప్పందం అంశాన్ని లేవనెత్తడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రగలిపోయారు. ఆమె సభలో నిలబడి రన్నింగ్ కామెంట్రీ చేస్తూ విమర్శలు గుప్పించారు. రాహుల్ ప్రసంగం ప్రారంభంలో ఎపికి బిజెపి చేసిన అన్యాయాలపై నిలదీస్తూనే తొలుత ఈ చర్చను మొదలుపెట్టిన టిడిపి ఎంపి గల్లా జయదేవ్ ను రాహుల్ అభినందించారు. ఇక నల్లధనం నిర్మూలిస్తామని చెప్పిన మోదీ మాట నిలుపుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు నష్టాన్ని ప్రస్తావించారు. ప్రతి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానన్న మాట ఎప్పుడు నిలబెట్టుకుంటారని ప్రశ్నించారు.

సభలో రాహుల్ ప్రసంగం అద్భుతంగా సాగింది. మధ్య మధ్యలో ఆయన ప్రసంగానికి బిజెపి సభ్యులు అడ్డు తగిలే ప్రయత్నం చేసినా.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా చెప్పాల్సిన విషయాలను సూటిగా, సుత్తి లేకుండా చెప్పేశారు రాహుల్ గాంధీ. రాహుల్ ప్రసంగంలో తన హావ భావాలతో సభలోని సభ్యులనే కాకుండా యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. రాహుల్ బ్యాటింగ్ తట్టుకోలేక అధికార పార్టీ సభ్యులు సభలో తీవ్రమైన రగడ సృష్టించారు. గొడవ పెద్దదవుతుండగా వారిని వారించే ప్రయత్నం చేసిన స్పీకర్ విధిలేని పరిస్థితుల్లో సభను వాయిదా వేశారు.

మొత్తానికి పప్పు కాదని రాహుల్ అవిశ్వాసం చర్చ సందర్భంగా నిరూపించుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు హ్యాప్పీగా ఫీల్ అవుతున్నాయి. మరి బిజెపి ఏరకమైన కౌంటర్ ఇస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.