కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధి పెద్ద హామీనే ఇచ్చారు. ఇంతకీ ఆ హామీ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేకహోదా ఇచ్చేస్తుందట. హోదా ఇవ్వటంపైనే మొదటి సంతకం చేస్తానని రాహూల్ ప్రకటించటం విచిత్రంగా ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రావాలి ? ప‌్రత్యేకహోదాపై మొదటి సంతకం ఎప్పటికి చేయాలి ? ఇదేమన్నా అయ్యే పనేనా ?
మొత్తం మీద రాహుల్ ప్రత్యేకహోదాపై బహిరంగసభలో హామీ ఇవ్వటం వెనుక చంద్రబాబునాయుడు వ్యూహం ఉన్నట్లు అనుమానంగా ఉంది. ఎందుకంటే ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వాలంటే ముందు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలి. సమీప భవిష్యత్తులో అది జరిగే పనికాదని హామీ ఇచ్చిన రాహూల్ కు హమీ ఇప్పించిన చంద్రబాబుకు కూడా బాగా తెలుసు. తెలిసి ఎందుకు రాహూల్ హామీ ఇచ్చారు ? ఎందుకంటే, కాంగ్రెస్-టిడిపి మధ్య పొత్తును సమర్ధించుకోవాలి కాబట్టి.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, టిడిపిలు పొత్తు పెట్టుకున్నాయి. ఆ పొత్తుపై మిగిలిన పార్టీలు మండిపడుతున్న విషయం అందరూ చూస్తున్నదే. నిజానికి తెలుగుదేశంపార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతతోనే అన్న విషయం తెలిసిందే. అటువంటిది ఇపుడు అదే కాంగ్రెస్ పార్టీతో టిడిపి పొత్తుపెట్టుకుందంటే ఏమనర్ధం ? అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. పార్టీ పెట్టింది ఎన్టీఆర్. పార్టీ ఇపుడున్నది చంద్రబాబు చేతిలో. ఎన్టీఆర్ కు విలువలు, సిద్దాంతాలుండేవి. చంద్రబాబుకు విలువలు, సిద్ధాంతాలు లేవు. అధికారం అందుకోవటం లేకపోతే నిలుపుకోవటమొకటే చంద్రబాబు లక్ష్యం.
తన లక్ష్యానికి అనుగుణంగానే చంద్రబాబు రాజకీయం చేస్తుంటారు. తెలంగాణాలో తుడిచిపెట్టుకుపోయిన పార్టీకి కొద్దిగానైనా జవసత్వాలు నింపాలంటే ఏదో ఓ పార్టీతో పొత్తు అవసరం. ఆ పార్టీనే కాంగ్రెస్ పార్టీ అయ్యింది. తెలంగాణలో పొత్తును ఏపిలో సమర్ధించుకోవాలంటే ప్రత్యేకహోదాపై రాహూల్ తో బహిరంగంగా హామీ ఇప్పించాలి. ఇపుడు జరిగిందదే అదే. రాహూల్ కూడా తన ప్రసంగంలో ఎక్కడా చంద్రబాబును ఒక్కమాట కూడా అనలేదు. దాదాపు 50 నిముషాలు మాట్లాడితే ఎక్కువ సేపు ప్రధానమంత్రి నరేంద్రమోడిని విమర్శించేందుకే సరిపోయింది.
పైగా ఏపిలో స్వయంసహాయకబృందాలు బాగా పనిచేస్తున్నాయనే కితాబివ్వటం గమనార్హం. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేయకుండా వ్యవస్ధను నిర్వీర్యం చేశారంటూ మహిళా సంఘాలు ఒకవైపు చంద్రబాబు, నారా లోకేష్ పై మండిపడుతుంటే రాహూలేమో డ్వాక్రా సంఘాలు బాగా పనిచేస్తున్నాయని చెప్పటమంటే రాహూల్ కళ్ళకు చంద్రబాబు పచ్చగంతలుకట్టేసినట్లు అర్దమైపోతుంది.