ఈ వినాయక మండలి సభ్యులు ఏం చేశారో తెలుసా

వినాయక చవితి వస్తుందంటే చాలు.. యువత నెల రోజుల ముందు నుంచే సందడి చేస్తారు. గణేష్ మండళ్ల ఏర్పాటు, చందాలు వసూలు చేయడం, వినాయకుడిని నిలబెట్టడం, పూజలు చేయడం, అన్నదాన కార్యక్రమాలు, నిమజ్జనం ఇలా యువత బిజిబిజిగా గడుపుతుంటది.

దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల ఇలాంటి ఉత్సాహమే కనిపిస్తుంది. కానీ ఇందుకు భిన్నంగా పుణేలోని నవశక్తి గణేష్ మండలి సభ్యులు మాత్రం ఓ మంచి పనికి తమ చందా డబ్బును ఉపయోగించారు. ప్రతి సంవత్సరం తాము ఖర్చు చేసే దానిలో సుమారు 80 శాతం సొమ్మును మిగిల్చి ఓ యువకుడి వైద్యానికి ఖర్చు పెట్టారు.

గాయపడ్డ యువకుడు సతీష్ జోరి

పుణేకు చెందిన సతీష్ జోరి అనాథ. అతని తల్లి చిన్నప్పుడే చనిపోయింది. అతని తండ్రి 5 ఏళ్ల క్రితం చనిపోయింది. అతని సంరక్షణ బాధ్యతలు చూసే మామయ్య రెండేళ్ల క్రితం మరణించారు. అప్పటి నుంచి సతీష్ ఒంటరిగా ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం అతనికి రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయి.

అతని బంధువులెవరు లేక పోవడంతో చుట్టు పక్కల ఉన్న నాలుగు ఆస్పత్రులు అతనికి చికిత్స అందించేందుకు నిరాకరించాయి. చివరకు రోడ్డుపై ఉన్నవారు సతీష్ ను అతని ఇంట్లో వదిలి వెళ్లారు. గత శనివారం రక్త స్రావంతో పడి ఉన్న సతీష్ ను స్థానికులే బాధ్యతతో కొర్తుద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఆదివారం సతీష్ తలకు శస్త్ర చికిత్స జరగగా… వైద్య ఖర్చులు భరించేందుకు నవశక్తి గణేష్ మండలి ముందుకొచ్చింది. మొత్తం వసూలైన చందాలో గణేష్ మండలి కోసం కేవలం రూ.1.5 లక్షలు ఖర్చుపెట్టి మిగిలిన 4.5 లక్షలు యువకుడి శస్త్ర చికిత్స కోసం ఖర్చు పెట్టారు.

నవశక్తి గణేష్ మండలి సభ్యులు

పుణేలో 56 ఏళ్లుగా నవశక్తి గణేష్ మండలి తరపున వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నారు. ఏటా పెద్ద స్థలంలో భారీ గణపతిని పెట్టి ఉత్సవాలు జరిపేవారు. కానీ ఈ సారీ చిన్న స్థలంలో గణనాధున్ని పెట్టారు. ఈ గణేష్ మండలి వారు చేసిన సేవను పలువురు అభినందిస్తున్నారు. మానవత్వాన్ని నిలిపిన యువకులకు అభినందనల వెల్లువ వెలువెత్తుతోంది.