కూతురి ప్రేమను నిరాకరించిన తండ్రి… ప్రియుడితో కలిసి దారుణానికి పాల్పడిన కూతురు…?

ప్రస్తుత కాలంలో యువతీ యువకులు ప్రేమ వ్యామోహంలో పడి తల్లిదండ్రుల మాటలను పెడచెవిన పెడుతున్నారు. తల్లిదండ్రులు వారి ప్రేమను నిరాకరించడం వల్ల కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకుంటూ ఉంటే మరి కొంతమంది మాత్రం ప్రేమించిన వారిని దక్కించుకోవడం కోసం తల్లిదండ్రులను సైతం హత్య చేయటానికి కూడా వెనుకాడటం లేదు. ఇటీవల ఇటువంటి దారుణ సంఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే…కర్నాటకలోని బెళగావికి చెందిన సుధీర్ కాంబళె అనే వ్యక్తి భార్య రోహిణీ,కూతురు స్నేహ తో కలిసి నివసిస్తున్నాడు. స్నేహా పుణెలో హోటల్‌ మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తున్న సమయంలో అక్షయ్‌ విఠకర్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కూతురి ప్రేమ విషయం తెలుసుకున్న సుధీర్ ఆమెను మందలించాడు. దీంతో తండ్రి మీద కోపం పెంచుకున్న స్నేహ తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడని భావించి తన తల్లి, ప్రియుడితో కలిసి తండ్రిని హత్య చేయడానికి పథకం వేసింది.

ఈ క్రమంలో స్నేహా తన ప్రియుడిని బెళగావికి రప్పించి ఇటీవల నిద్రపోతున్న తండ్రిని తన తల్లి సహాయంతో కాళ్లు చేతులు గట్టిగా పట్టుకొని ప్రియుడు చేత కత్తితో పొడిపించి హత్య చేయించింది. ఆ తర్వాత తన ప్రియుడిని వెంటనే పూణేకు పంపించి ఏమీ ఎరగనట్టుగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమ తండ్రిని హత్య చేసినట్లు అందరిని నమ్మించడానికి ప్రయత్నించారు. అయితే తల్లి కూతుర్ల ప్రవర్తన మీద అనుమానం ఉన్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టారు. దీంతో పోలీసులు స్నేహ తల్లిని, ఆమె ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.