పిల్లలు పుట్టడం లేదని క్షుద్ర పూజలు చేయించి భార్య చేత అస్థికల తినిపించిన భర్త!

ప్రస్తుతం కాలంలో దేశం రోజురోజుకి సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందుతోంది. అయితే కొన్ని మారుమూల ప్రాంతాలలో నివసించి ప్రజలు మాత్రం ఇప్పటికీ సాంకేతికతకు దూరంగా ఉంటూ మూఢనమ్మకాలను నమ్ముతున్నారు. మూఢనమ్మకాల పట్ల విశ్వాసం ఉన్న ప్రజలు దొంగ బాబాలను ఆశ్రయించి వారిని నమ్మి నిలువునా మోసపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ మూఢనమ్మకాలు గ్రామాలనుండి పట్టణాలకు కూడా వ్యాపించాయి. తాజాగా పూణేలో వివాహిత మీద క్షుద్ర పూజలు చేసిన ఘటన సంచలనంగా మారింది. వివాహం తర్వాత మహిళకు పిల్లలు పుట్టలేదన్న కారణంతో భర్త తో పాటు అత్తమామలు కలిసి ఆమెను హింసించటమే కాకుండా క్షుద్ర పూజలు చేయించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే…మహారాష్ట్రలోని పుణె లోని సింహగడ్ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివాహిత మహిళకు పిల్లలు పుట్టలేదన్న నేపంతో ఆమె భర్త అత్తమామలు తరచు ఆమెను అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా పిల్లలు పుట్టలేదని ఆమెపై పలుమార్లు దాడి చేశారు. ఇలా చాలా కాలంగా ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించారు. అంతే కాకుండా ఆమెపై నరబలి, జంతుబలి చేసే మాంత్రికుడితో క్షుద్ర పూజలు కూడా చేయించారు. ఇలా వారి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఇక ఇటీవల ఆ మహిళ చేత అస్థికలు కూడా తినిపించారు.

ఇలా భర్త అత్తమామలు పెట్టే బాధలు భరించలేక ఇటీవల ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో నేరస్థులుగా భావించిన ఎనిమిది మందిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఈ ఘటనపై మహారాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్​పర్సన్ రూపాలీ చకంకర్ స్పందించి నేరస్తులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశించారు. పూణే ఇలాంటి ఒక మహానగరంలో ఇలాంటి దారుణ సంఘటన చోటు చేసుకోవడం బాధాకరమని ఆవిడ వెల్లడించారు.