రాముని అవ‌తారం..!

మ‌నం అభిమానించే రాజ‌కీయ నాయ‌కుల‌ను దేవుళ్లుగా చిత్రీక‌రించి గోడ‌ల‌పై పోస్ట‌ర్లు అతికించ‌డం, వీధుల్లో బ్యాన‌ర్లు క‌ట్ట‌డం అల‌వాటే. తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు చంద్ర‌బాబు నాయుడు, కేసీఆర్‌ల‌ను దేవుళ్లుగా చిత్రీక‌రించిన బ్యాన‌ర్లు చాలానే క‌నిపిస్తాయి. ఈ అల‌వాటు మ‌న‌కు మాత్ర‌మే ప‌రిమితం కాలేదు.

ఉత్త‌రాదిలోనూ అలాంటి అభిమానుల హ‌వా న‌డుస్తోంది. మ‌మ‌తా బెన‌ర్జీని కాళిక కీర్తిస్తూ, మొన్న‌టి ద‌స‌రా ఉత్స‌వాల్లో ఏకంగా గుడినే క‌ట్టారు అభిమానులు. తాజాగా ఇదే జాబితాలో కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ కూడా చేరారు. రాహుల్ గాంధీని శ్రీ‌రామ‌చంద్రునిగా చిత్రీక‌రించిన బ్యాన‌ర్ ఒక‌టి బిహార్ రాజ‌ధాని పాట్నా వీధుల్లో క‌నిపిస్తోంది. ఇది కొత్తేమీ కాదు గానీ.. అందులో రాసిన స్లోగ‌న్లు బీజేపీని ర‌క్తం కారేలా గిల్లుతున్నాయి.

`వాళ్లు (బీజేపీ నాయ‌కులు) రామనామాన్ని జ‌పిస్తూ కాల‌క్షేపం చేస్తుంటారు. మీరు (రాహుల్ గాంధీ) సాక్షాత్తూ శ్రీ‌రామ‌చంద్రునిలా జీవించండి..` అనే స్లోగ‌న్ ఆస‌క్తి రేపుతోంది. బ్యాన‌ర్‌లో సోనియాగాంధీ, మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌ల‌తో పాటు ఇటీవ‌లే క్రియాశీల‌క రాజ‌కీయాల్లో అడుగు పెట్టిన ప్రియాంకా గాంధీ పిక్స్‌ను కూడా ఫిక్స్ చేశారు.