వందలాది మంది ప్రజలు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పర్రికార్ ఇంటిదగ్గిర గుమికూడి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, రాజీనామాచేసేందుకు 48 గంటల గడువుకూడా విధించారు. అంతకు ముందు వారు ఒక కిలో మీటర్ నుంచి ర్యాలీతో ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. వీరంతా ‘పరిపాలన పునరుద్ధరణ ప్రజా యాత్ర’ ( People’s March For Restoration of Governance’) ఏర్పడ్డారు. వారికి కాంగ్రెస్ పార్టీ, ఎన్ సిపి, శివసేన కూడా మద్దతు తెలిపాయి.
ఈ ప్రజలంతా గోవాకు ఫుల్ టైం చీఫ్ మినిష్టర్ కావాలని డిమాండ్ చేశారు. నినాదాాలు చేశారు.గోవాలో ఇపుడు పార్ట్ టైం ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని, ఇది పనికిరాదని వారు అంటున్నారు. చికిత్స కోసం విదేశాలకు వెళ్లడం, తరచూ ఆసుపత్రిలో ఉండటంతో పర్రికార్ దాదాపు 9 నెలలుగా విధులకు హాజరుకావడం లేదు. ఆరోగ్యం బాగా లేకపోయినా బిజెపి ఆయనను కొనసాగిస్తూనే ఉంది. ముఖ్యమంత్రి మంత్రులను గాని, ఎమ్మెల్యేలను గాని కలుసుకోవడమే లేదు. అందువల్ల ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగడం భావ్యం కాదని వారు అంటున్నారు. మనోహర్ పర్రికార్ పాంక్రియాస్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు.
తీవ్ర అనారోగ్యం కారణంగా ముఖ్యమంత్రి ప్రదర్శకులను కలుసుకోలేదని సిఎంఒ అధికారులు చెబుతున్నారు.
పర్రికార్ అనారోగ్యం తీవ్రమయింది. ఆయన పరిస్థితితరచూ క్షీణిస్తూ ఉంది. అయితే, ఆయన వైదొలగితే గోవాలో బిజెపి పరిస్థితి దిగజారుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.