పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల పై జరిగిన ఉగ్రదాడి తర్వాత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి స్పందించారు. దాడి జరిగిన ఐదు రోజుల తర్వాత ప్రధాని మాట్లాడారు. జమ్ములో ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మీడియా ముందుకు వచ్చిన పాక్ ప్రధాని ఏమన్నారంటే…
“ఉగ్రదాడితో పాక్ కు సంబంధాలున్నాయని చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. ఇలాంటి దాడి చేస్తే మాకేంటి ప్రయోజనం. మేం ఉగ్రవాదాన్ని కాదు స్థిరత్వాన్ని కోరుకుంటున్నాం. ఆ దిశగా పయనిస్తున్నాం. పుల్వామా దాడికి మమ్మల్ని నిందించకండి. మేం కూడా ఉగ్ర బాధితులమే.
ఎలాంటి ఆధారాలు లేకుండా మా పై ఆరోపణలు చేస్తున్నారు. శాంతి కోసం చేస్తున్న పోరాటంలో ఇప్పటికే లక్షల మంది ప్రజలను మేం కోల్పోయాం. మీరన్నట్లుగా నిజంగానే దాడిలో మ పాక్ ప్రమేయం ఉంటే దర్యాప్తుకు సహకరించేందుకు సిద్దంగా ఉన్నాం. దానికి నేను హామీనిస్తున్నా.
యుద్దాన్ని ప్రారంభించడం సులువే అది మన చేతిలోనే ఉంటుంది. కానీ అది ఎక్కడ ఎలా ఆగుతుందో అది ఆ దేవుడికే తెలియాలి. సమస్యలను చర్చలతోనే పరిష్కరించుకోవాలి. పాక్ పై దాడి చేస్తే ప్రతిఘటించమని భారత్ భావిస్తోంది. కానీ మీ చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది. కశ్మీర్ ప్రజలు చావుకు భయపడడం లేదు. ఈ విషయాన్ని భారత్ తెలుసుకోవాలి.” అని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు.
ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల పై భారత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ తప్పు చేయలేదు అనుకుంటూనే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. భయంతోనే పాక్ ప్రధాని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని పై భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.