కొద్దిరోజుల కిందటి వరకూ `మీ టూ` ఉద్యమం దేశం మొత్తాన్నీ ఓ ఊపు ఊపేసింది. సినిమా, ప్రింట్, మీడియా రంగాల్లో మహిళ ఉద్యోగులు, నటులపై లైంగిక ఆరోపణలపై స్పందిస్తూ ఎక్కడో అమెరికాలో మొదలైన మీ టూ ఉద్యమం.. మన దేశంలో కొందరు పెద్ద తలకాయల ఉద్యోగాలను కూడా ఊడగొట్టింది. ఇందులో కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ కాలమిస్టు ఎంజే అక్బర్ కూడా ఉన్నారు.
మీ టూ ఉద్యమం సద్దు మణిగిన కొద్దిరోజుల్లోనే, తాజాగా `రెడీ టు వెయిట్` ఉద్యమ అగ్గి రాజుకుంది. కేరళలో పురుడు పోసుకున్న ఈ రెడీ టు వెయిట్ ఉద్యమం ఆ రాష్ట్రంతోనే ఆగిపోతుందా? లేదా? అనేది పక్కన పెడితే..అందరి దృష్టినీ ఆకర్షించిందా మూవ్‌మెంట్. వయస్సుతో సంబంధం లేకుండా శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని ప్రతి మహిళా సందర్శించవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత మొదలైందీ ఉద్యమం. అప్పట్లో పెద్దగా ప్రాచుర్యానికి నోచుకోలేదు.
కేరళలో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో.. మరోసారి తెరమీదికి వచ్చింది ఇది. 40కి కాస్త అటు ఇటుగా వయస్సున్న ఇద్దరు మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడంతో కేరళ భగ్గుమంటోంది. అధికారంలో ఉన్న సీపీఎం కార్యాలయాలపై దాడులు కొనసాగాయి. 700 మందికి పైగా `సేవ్ శబరిమల` ఉద్యమకారులు అరెస్టయ్యారు.
ఈ పరిస్థితుల్లో మరోసారి `రెడీ టు వెయిట్` ఉద్యమం అక్కడ వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏమిటీ రెడీ టు వెయిట్. తమకు 50 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకూ అయ్యప్ప స్వామిని దర్శించడానికి వేచి ఉంటామనేది దీని సారాంశం. కేరళలో మాత్రమే కాదు, రాష్ట్రం బయట ఉన్న మలయాళీ మహిళలు, యువతులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు.