హైవే రోడ్డు వెంబడి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురయ్యే ముఖ్యమైన సమస్య టోల్ గేట్స్. దీని వల్ల కొంత సేపు అక్కడ ఆగాల్సి వస్తుంటుంది. కొన్నిసార్లు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులుపడతారు. ఐతే భవిష్యత్తులో ఆ సమస్య ఉండదు. అసలు టోల్‌గేట్సే కనిపించవు. ఎందుకంటే టోల్ వసూలు కేంద్రప్రభుత్వం జీపీఎస్ టెక్నాలజీని ఖరారు చేసినట్లు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితన్ గడ్కరీ తెలిపారు.
దీనివల్ల టోల్ గేటు వద్ద ఆగాల్సిన పని లేకుండా సాఫీగా సాగిపోవచ్చని ఆయన తెలిపారు. వచ్చే రెండేళ్లలో భారత్ టోల్ ఫ్రీ దేశంగా మారుతుందని తెలిపారు. అసోచాం ఫౌండేషన్ వీక్‌లో మాట్లాడిన నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్థిక పునరుజ్జీవనం కోసం నేషనల్ ఇన్ఫాస్ట్రక్చర్ పైప్ లైన్ అనే అంశంపై తన దృక్పథాన్ని పంచుకున్నారు.
జీపీఎస్ ఆధారంగా వాహన కదలికలను బట్టి వినియోగదారు బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్ మొత్తాన్ని మినహాయించే నూతన వ్యవస్థ రానుంది. వచ్చే మార్చి నాటికి దేశంలోని టోల్ వసూళ్లు రూ.34 వేల కోట్లకు చేరుతాయని అంచనా. అన్ని టోల్ వసూళ్లకు జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల వచ్చే ఐదేళ్లలో టోల్ ఆదాయం రూ.1.34 లక్షల కోట్లకు చేరుతుంది” అని నితిన్ గడ్కరీ చెప్పారు.