నిత్యానంద. ఆధునిక స్వామీజీగా ఆయనకు పేరుంది. తమిళ నటి రంజితతో `సన్నిహితం`గా ఉన్న వీడియో గనక బయటికి రాకపోయి ఉంటే ఈయన్యూ భక్తులు దేవుడిలా కొలిచే వారేమో. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ భక్తులు ఉన్నారాయనకు. అలాగే- కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలూ ఉన్నాయి. వివాదాలు కూడా అలాగే ఉన్నాయనుకోండి అది వేరే విషయం.
తాజాగా, నిత్యానంద భక్తులకు ఉద్దేశించిన `ప్రవచించిన` ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. సుమారు 2:39 సెకెన్లు ఉన్న ఈ వీడియోలో నిత్యానంద ప్రసంగం మొత్తం ఆంగ్లంలో కొనసాగుతుంది. మీ జీవిత భాగస్వామిని ఎలా కిడ్నాప్ చేయాలి? అనేదే వీడియోలో ఆయన చేసిన బోధన. బెంగళూరు సమీపంలోని బిడిది ఉన్న ఆశ్రమంలో భక్తులతో ముఖాముఖి సందర్భంగా ఆయన ఈ `విలువైన` ప్రశ్నకు సమాధానాలను ఇచ్చారు.
`హౌ టు కిడ్నాప్ యువర్ స్పౌస్.. వెరీ రిస్కీ క్వశ్చన్.. అంటూ మొదలు పెట్టి అది అసాధ్యమంటూ తేల్చేశారాయన. ప్రపంచంలో ఎవరికైనా సలహాలు ఇవ్వొచ్చు గానీ, పొరపాటున కూడా భార్యకు మాత్రం ఎలాంటి సలహాలు ఇవ్వొద్దని సూచించారు. మనం ఏది చెబితే, వారు దానికి భిన్నంగా ప్రవర్తిస్తారని చెప్పుకొచ్చారు. ఈ సమస్య మనుషులది మాత్రమే కాదని, సాక్షాత్తూ పరమ శివుడు కూడా తన భార్యకు సలహా ఇచ్చే సాహసం చేయలేదని అన్నారు.