కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన శైలికి భిన్నంగా వ్యవహరించటం రాజకీయ వర్గాలలో ఇప్పుడు పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆ వ్యవహారానికి సంబంధించి మాత్రమే నోరు విప్పే ఆవిడ ఇప్పుడు ప్రత్యర్థులపై విరుచుకుపడటం చాలా మందికి ఆశ్చర్యకరంగానే ఉంది. మోడీ పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీని కడిగేస్తే తాజాగా ఆ బాధ్యతను నిర్మల తీసుకుని రెచ్చిపోయారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలు మరియు మధ్యతరగతి ప్రజల కోసం పని చేస్తుందని, కొంతమంది అల్లుళ్ళ కోసం పని చేయడం లేదని నిర్మల సీతారామన్ కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ విమర్శించారు. రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రమాదకరమైన వ్యక్తిగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. ఇండియాకు రాహుల్ డూమ్స్ డే మ్యాన్ గా మారుతున్నారని అన్నారు. క్రోనీస్ అంటే ఎవరు ? మా క్రోనీలు ఈ దేశ సామాన్య ప్రజలే అన్నారు. బడ్జెట్ సంబంధిత ప్రశ్నలపై లోక్ సభలో సమాధానం ఇవ్వడానికి ముందు నిర్మలా సీతారామన్… ఇలా రాహుల్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు సహా ఇతరత్రా అంశాలపై రాహుల్ వక్ర భాష్యాలు చెప్తున్నారన్న నిర్మలా… కేంద్ర ప్రభుత్వం సంపన్న వర్గాలకు,కార్పోరేట్ల కోసం పనిచేస్తోందన్న విమర్శలను ఆమె తప్పు పట్టారు. అసలు వ్యవసాయ చట్టాల విషయంలో ఏ వైఖరి తీసుకోవాలో కాంగ్రెస్ పార్టీకే స్పష్టత లేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలోనూ ఇవే తరహా చట్టాలను పొందుపరిచారని… తీరా ఇప్పుడు ఆ చట్టాలపై యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ ఎందుకు యూటర్న్ తీసుకుందో లోక్‌సభలో రాహుల్ గాంధీ వివరిస్తారని భావించానని… కానీ అదేమీ జరగలేదని అన్నారు.
కాగా నిర్మలమ్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రతాపన్ మండిపడుతూ ఆమెపై లోక్ సభలో సభాహక్కుల నోటీసులు ఇవ్వటం జరిగింది. ప్రతాపన్ మాట్లాడుతూ, పార్లమెంటుకు ఎన్నికైన సభ్యుడిని భారతదేశ ప్రళయకారకుడిగా పరిహసించడం దారుణమని అన్నారు. ఏ ఉద్దేశంతో ఆమె అలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వంపై అసమ్మతిని వ్యక్తం చేసేవారిని దేశ వ్యతిరేకులుగా, విచ్ఛిన్నకర శక్తులుగా చిత్రీకరిస్తున్నారని చెప్పారు. ఇలాంటి ధోరణి ఏమాత్రం సహించరానిదని అన్నారు.
