ఇండియాలో పలు బ్యాంకులకు వేల కోట్ల టోకరా పెట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి లండన్ కోర్టు షాకిచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి దాదాపుగా రూ.14 వేల కోట్లు ఎగ్గొట్టి చట్టంలో లొసుగులను ఆసరాగా మార్చుకుని యూకే వెళ్లి అక్కడే ఉండిపోయాడు నీరవ్. ఎట్టకేలకు ఇప్పటికి నీరవ్ మోడీ విషయంలో బ్రిటన్ కోర్టులో భారత్ విజయం సాధించింది. విచారణ సందర్భంగా నీరవ్ మోడీ వాదనలను బ్రిటన్ కోర్టు కొట్టేసి భారత్ పంపేందుకు అనుమతించింది.
సీబీఐ ఈ కేసుపై 2018 ఫిబ్రవరి 5 నుంచి దర్యాప్తు ప్రారంభించింది. అదే నెల 16 న ఈడీ నీరవ్ మోడీ ఇల్లు, కార్యాలయంపై దాడి చేసి 5,674 కోట్ల విలువైన వజ్రాలు, ఇతర జువెల్లరీని స్వాధీనం చేసుకుంది.ఆ తర్వాత నీరవ్ లండన్ లో ఉన్నట్లు తెలిసి ఆగష్టు 3 న భారత ప్రభుత్వం బ్రిటిష్ సర్కార్ ఎంబ్లమ్ కొమ్మాకు దరఖాస్తు పెట్టింది. మొత్తానికి నీరవ్ మోడీ లండన్ లో ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఆ ఏడాది డిసెంబరు 27 న తమ దేశంలోనే నీరవ్ మోడీ ఉన్నట్టు లండన్ కోర్టు భారత ప్రభుత్వానికి తెలిపింది. నీరవ్ పై కోర్టు ఫాల్ వారంట్ ను జారీ చేయగా 2019 మార్చి 20న పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని బెయిల్ అభ్యర్థనను మొత్తం 5 సార్లు కోర్టు కొట్టివేసింది.
నీరవ్ కేసు అక్కడి కోర్టులో దాదాపుగా రెండేళ్ల పాటు కొనసాగుతూ వచ్చింది. పలు సాకులు చెబుతూ నీరవ్ మోడీ ఇండియాకు వెళ్లేందుకు నిరాకరిస్తూ ఇన్నాళ్లు తప్పించుకున్నాడు. భారత్‌కు అప్పగిస్తే తనకు న్యాయం జరగదని, ఆరోగ్య స్థితి సరిగ్గా లేదనే సాకులతో నీరవ్ చేసిన అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది. భారత్‌కు అప్పగిస్తే అన్యాయం జరుగుతుందనే వాదనకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. భారత్‌కు అప్పగించినా ఆయనకు అన్యాయం జరగదని కోర్టు స్పష్టం చేసింది. నీరవ్‌కు ముంబై ఆర్థర్ రోడ్ జైలులోని 12వ బ్యారక్ సరిపోతుందని కోర్టు పేర్కొంది. అక్కడే ఆయనకు కావాల్సిన చికిత్స కూడా అందించాలని సూచించింది.