#జస్ట్ ఆస్కింగ్: “మోడీ” పేరు జనంతో చెప్పిస్తున్న ప్రకాశ్ రాజ్!

దేశంలో ప్రతిపక్షాలు సైతం ప్రశ్నించని స్థాయిలో, విపక్షాలు సైతం విమర్శించలేని రీతిలో… బీజేపీ పేరు చెబితే అంతెత్తున లేస్తుంటారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. ఒక్కమాటలో చెప్పాలంటే… బీజేపీ విధానాలు అన్నా, మోడీ అన్నా ఒంటికాలిపై లేస్తారు. ఇదే ఫ్లోలో తాజాగా మరో కొత్త వివాదానికి కారణమయ్యారు ప్రకాష్ రాజ్. ఏ పేరు ప్రస్థావించడంవల్ల రాహుల్ గాంధీకి జైలు శిక్ష పడిందో… అదే పేరుని దేశప్రజలందరితో చెప్పించాలనో – అలాంటి ఆలోచనను కలిగించాలనో తెలియదు కానీ… ముగ్గురు మోడీల సంచలన పోస్ట్ పెట్టారు ప్రకాశ్ రాజ్!

ప్రధాని మోడీతో సహా మరో ఇద్దరు మోడీల ఫొటోలతో ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదంగా మారుతోంది. రాజకీయ రచ్చకు కారణమైంది. ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ పై బీజేపీ నేతలు ఫైరవుతుండగా… బీజేపీయేతర నేతలు మాత్రం లైక్ లు షేర్లూ కొడుతూ.. దేశానికి ఒక మెసేజ్ పంపే పనిలో ఉన్నారు. తాజాగా ట్విట్టర్లో లలిత్ మోడీ – నరేంద్ర మోడీ – నీరవ్ మోడీల ఫోటోలతో ఒక పోస్ట్ చేశారు ప్రకాశ్ రాజ్. అవును… ఒకపక్క లలిత్ మోడీ – మరోపక్క నీరవ్ మోడీల ఫోటోలు… మధ్యలో మోడీ ఫోటోతో ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

ఆ ఫోటోతో పాటు… “జనరల్ నాలెడ్జ్: ఇక్కడ ఒక కామన్ విషయం ఉంది.. కనిపెట్టండి” అంటూ “#జస్ట్ ఆస్కింగ్” అనే ట్యాగ్ ను వేసి ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్. ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫలితంగా ఈ ట్వీట్ తో ప్రకాష్ రాజ్ నేరుగా రాహుల్ కు మద్దతుగా నిలిచినట్లయ్యింది. గతంలో కూడా బీజేపీ నేతలను రెచ్చగొట్టే ఏ అవకాశాన్ని ప్రకాష్ రాజ్ వదిలేవారు కాదు. తాజా ట్వీట్ తో… ప్రకాష్ రాజ్ తనదైన రీతిలో రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కాగా… పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించింది.. 2019లో “దొంగలందరూ మోడీ లాంటి సాధారణ ఇంటిపేరును ఎలా కలిగి ఉంటారు” అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో రాహుల్ ని దోషిగా నిర్ధారించిన కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని అనుసరించి లోక్ సభ ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8(3) ప్రకారం రాహుల్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది!