కీలక దశలో ఇస్రోకు హెల్ప్… రంగంలోకి దిగిన నాసా!

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ – 3.. కీలక దశకు చేరుకొన్న సంగతి తెలిసిందే. చివరి 17 నిమిషాల కిల్లర్ టైం అత్యంత కీలకంగా చెబుతున్న దశ సజావుగా పూర్తయితే.. అంతరిక్ష రంగంలో భారత్ చరిత్ర సృష్టించినట్లే. పైగా రష్యా లూనా – 25 సైతం విఫలమైన నేపాథ్యంలో ఇది మరింత కీలకంగా మారే ఛాన్స్ ఉంది!

అవును… చందమామకు మరింత చేరువైంది భారత ఉపగ్రహం. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ఇప్పటికే ల్యాండర్ విడిపోయింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం.. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోన్నాయి. అన్నీ సజావుగా సాగితే ఈరోజు సాయంత్రం 6:04 నిమిషాలకు ఈ రెండూ చంద్రుడి దక్షిణధృవంపై ల్యాండ్ కానున్నాయి. ఈ చారిత్రక ఘట్టం కోసం యావత్ భారత్ తో పాటు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది.

అయితే చంద్రయాన్ – 2 ఫెయిల్యూర్ ఈసారి ఇస్రో మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా చేస్తుందని తెలుస్తోంది. గతంలో జరిగిన తప్పులు ఈసారి జరగకుండా ఇప్పటికే ఇస్రో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. అయితే రష్యాకు చెందిన మూన్ మిషన్ లూనా 25 విఫలమవ్వడంతో అందుకు గల కారణాలను సైతం తెలుసుకునే పనిలో ఉందని తెలుస్తోంది.

2019లో ప్రయోగించిన చంద్రయాన్ – 2 విఫలమైన నేపథ్యంలో.. ఆ చేదు ఘటన పునరావృతం కాకుండా ఇస్రో అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. అదే సమయంలో రష్యాకు చెందిన మూన్ మిషన్ లూనా 25 కూడా విఫలం కావడం, క్రాష్ ల్యాండింగ్ కావడం.. వంటి పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటోంది.

ఈ సమయంలో నాసా సహకారాన్ని కూడా తీసుకోనుంది ఇస్రో. అదేవిధంగా… యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సైతం ఇస్రోకు సహకరించడానికి ముందుకొచ్చింది. కాన్‌ బెర్రాలో నాసాకు చెందిన డీప్ స్పేస్ కమ్యూనికేషన్స్ స్టేషన్-36, డీ.ఎస్.ఎస్. 34 నుంచి చంద్రయాన్ – 3 మాడ్యుల్ టెలిమెట్రీ, ట్రాకింగ్ కవరేజీని అందుకుంటోంది ఇస్రో.

దీంతో… రోవర్, ల్యాండర్.. చంద్రుడిపై అడుగు పెట్టేంత వరకూ ఇస్రో – యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లు రెండింటి పర్యవేక్షణ కూడా కొనసాగుతుందని ఇస్రో చెబుతుంది. ఈ రెండు ఏజెన్సీల నుంచి మాడ్యుల్ పనితీరుకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు అందుకుంటోన్నామని, ల్యాండింగ్ సమయంలోనూ అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి నాసా, ఈ.ఎస్.ఏ. సహకరిస్తాయని చెబుతుంది ఇస్రో!