దేశం ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనడంలో అంతరిక్షం కీలక భూమిక పోషిస్తున్నదని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. అగర్తలలో జరిగిన సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుతం దేశ రక్షణ కోసం 10 అత్యంత శక్తివంతమైన ఉపగ్రహాలు నిత్యం నిఘా చేస్తున్నాయన్నారు.
“సుమారు 7,000 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని నిరంతరం పర్యవేక్షించాలంటే, హై-రిజల్యూషన్ సాటిలైట్‌లు అత్యవసరం. ఇవి సరిహద్దు దాటి చొరబడే శక్తుల కదలికలను ముందే గుర్తించి, వ్యూహాత్మక నిర్ణయాలకు దోహదపడతాయి” అని ఆయన వివరించారు. ఈ ఉపగ్రహాలు సైనిక అవసరాలతో పాటు, విపత్తు నిర్వహణ, అంతర్గత భద్రతకు కూడా కీలకమని చెప్పారు.
ఇస్రో సాటిలైట్ నెట్‌వర్క్ వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలకూ సేవలు అందిస్తోందని నారాయణన్ వెల్లడించారు. టెలీ-ఎడ్యుకేషన్, టెలీ-మెడిసిన్ సేవల ద్వారా దూర ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా భూకంపాలు, తుఫానుల వంటి విపత్తుల సమయంలో ఈ ఉపగ్రహాల సమాచారం ప్రాణాలు కాపాడడంలో కీలకమని గుర్తు చేశారు.
ఇంతకుముందు చంద్రయాన్-1 ద్వారా చంద్రుడిపై నీటి ఆనవాళ్లను కనుగొన్న తొలి దేశంగా భారత్ నిలిచిన ఘనతను నారాయణన్ ప్రస్తావించారు. ఇప్పటివరకు 34 దేశాలకి చెందిన 433 ఉపగ్రహాలను ప్రయోగించిన అనుభవం భారత్‌కు ఉందని చెప్పారు.
ప్రస్తుతం అమెరికాతో కలిసి అత్యంత ఖరీదైన భూమి పర్యవేక్షణ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేస్తున్నామని, దానిని భారత భూమి నుంచి ప్రయోగించనున్నట్లు నారాయణన్ వెల్లడించారు. భవిష్యత్తులో దేశ భద్రత, అభివృద్ధి లక్ష్యాల కోసం ఇస్రో తుది సరిహద్దుల వరకు ప్రయాణిస్తుందని స్పష్టం చేశారు.