మోడీ సర్కార్ సెల్ఫ్ గోల్: ఆక్సిజన్ మరణాల్లేకపోవడమేంటి.?

దేశంలో ఆక్సిజన్ కొరత కారణంగా వేలాది ప్రాణాలు కరోనా సెకెండ్ వేవ్ సమయంలో గాల్లో కలిసిపోయాయి. ఇది జగమెరిగిన సత్యం. ఆక్సిజన్ సమస్య వుంది కాబట్టే, విదేశాల నుంచి యుద్ధ విమానాల ద్వారా, యుద్ధ నౌకల ద్వారా ఆక్సిజన్ ట్యాంకుల్నీ, సిలెండర్లనీ తెప్పించుకోవాల్సి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో.. ఆక్సిజన్ సిలెండర్లను కార్ల పక్కన అమర్చుకుని మరీ కరోనా బాధితులు కొందరు ప్రాణాలు నిలుపుకున్నారు.. కొందరు ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయారు. అక్కడా ఇక్కడా అని లేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా సెకెండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ అందక వందలాది మంది వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. స్వచ్ఛంద సంస్థలు, సినీ ప్రముఖులు.. కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ సిలెండర్లను అందించేందుకు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. అయినా, కొన్ని ప్రాణాల్ని మాత్రమే కాపాడగలిగారు.

వాస్తవ పరిస్థితి ఇలా వుంటే, కేంద్రం మాత్రం కరోనా సెకెండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా ఎవరూ మృతి చెందలేదని పార్లమెంటు సాక్షిగా చెప్పడం వివాదాస్పదమవుతోంది. విపక్షాలు కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. కేంద్రం మాత్రం, రాష్ట్రాలు పంపిన నివేదికల సమాచారాన్నే తాము వెల్లడించాం తప్ప, అది తమ సొంత లెక్క కాదని చేతులు దులపుకోవడం గమనార్హం. ఏ రాష్ట్రమైనా ఆక్సిజన్ కొరత కారణంగా తమ రాష్ట్రంలో పౌరులెవరూ చనిపోలేదని చెప్పగలదా.? మీడియాలో బోల్డంత ఫుటేజ్ అందుబాటులో వుంది. ఆక్సిజన్ సమస్య దేశంలో ఎలా కరోనా సెకెండ్ వేవ్ సమయంలో వుందో చెప్పడానికి ఆ వీడియోలే నిదర్శనం. మరీ ఇంత బాధ్యతా రాహిత్యమా.? అసలు దేశ ప్రజల పట్ల బాధ్యత వున్నట్లే మోడీ సర్కార్ వ్యవహరిస్తోందా.? బాధ్యత విస్మరించి వ్యవహరిస్తోందా.? అన్న సందేహాలు కలుగుతున్నాయి అందరికీ.