చారిత్రక తప్పిదం చేసేసిన ప్రధాని నరేంద్ర మోడీ.!

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. దాదాపు ఏడాది సమయం వుండగా, ఇప్పుడు రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడమేంటి.? ఆయన్ని అనర్హుడిగా ప్రకటించడమేంటి.? హత్య కేసు కాదు.. ఇంకో తీవ్రమైన నేరమూ కాదు. పరువు నష్టం కేసు. పైగా, ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన వ్యవహారం. రాజకీయాల్లో ఆరోపణలు మామూలే. అలాంటి ఆరోపణే చేశారు రాహుల్ గాంధీ. కేసు నమోదైంది, న్యాయస్థానం శిక్ష విధించింది. పై కోర్టులో అప్పీల్ చేసుకోవడానికీ అవకాశమిచ్చింది.

పైకోర్టులో ఏం జరుగుతుందన్నది వేచి చూడకుండానే లోక్ సభ కార్యాలయం అనర్హత వేటు వేసిందంటే, ప్రధాని నరేంద్ర మోడీ ఒత్తిడి లేకుండా రాహుల్ గాంధీ మీద ఈ వేటు పడిందని అనుకోలేం. ఎంపీ పదవి పోయినమంత మాత్రాన రాహుల్ గాంధీకి వచ్చే నష్టమేముంది.? కాంగ్రెస్ హయాంలో ప్రధాని పదవి వస్తేనే, కాదనుకున్నారాయన.

దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ మీద విపరీతమైన సింపతీ క్రియేట్ అవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ కూడా, రాహుల్ వ్యవహరాంలో బీజేపీ తీరుని  తప్పు పట్టారు. పార్టీలకతీతంగా రాజకీయ ప్రముఖులు, రాహుల్‌పై అనర్హత వేటు అప్రజాస్వామికమని అంటున్నారు.కరడుగట్టిన బీజేపీ వాదులు కూడా, ఆఫ్ ది రికార్డుగా తమ పార్టీ తీరు పట్ల ఆక్షేపణ వ్యక్తం చేస్తుండడం గమనార్హం. క్రిమినల్ కేసుల్లో శిక్ష పడితే, అనర్హత వేటు వేయడమేంటి.? పైగా, పై కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం వున్నప్పుడు ఇదేం పైత్యం.? ఔను, ప్రధాని మోడీ చారిత్రక తప్పిదం చేశారు.

కాలం కలిసొచ్చి, కాంగ్రెస్ గనుక దేశంలో అధికారంలోకి వస్తే, బీజేపీ తరహాలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే, అందరిపైనా అనర్మత వేటు వేసుకుంటూ వెళితే.. ఒక్క బీజేపీ ప్రజా ప్రతినిథి అయినా చట్ట సభల్లో కనిపించే అవకాశమే వుండదు కదా.!