తమకు జరిగిన అన్యాయాలను గళమెత్తుతూ మహిళా లోకం గర్జిస్తోంది. దైర్యంగా వీధుల్లోకి వచ్చి తమకు జరిగిన అన్యాయాలపై ఆక్రోశిస్తున్నారు. సామాజిక కార్యకర్త తరానా బుర్కే మొదలు పెట్టిన మీ టూ ఉద్యమం యావత్ మహిళా లోకాన్ని కదిలించింది.
సమాజంలోని అన్ని రంగాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల సమస్య తీవ్రతను ప్రపంచానికి చాటింది. లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాడేలా మహిళలను ఏకం చేసింది. ఇది మనదేశంలోని సెలబ్రిటీలనూ కదిలించి వారికి ఎదురైన చేదు అనుభవాలను ప్రపంచానికి తెలిసేలా చేసింది.
మహిళలు మౌనం వీడి.. సోషల్ మీడియా వేదికల మీదికి వచ్చి.. తమపై జరిగిన లైంగిక వేధింపులు, లైంగిక దాడులపై అంతర్జాతీయంగా ఆరంభించిన ‘మీ టూ’ ఉద్యమం ఇప్పుడు మన దేశంలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది.
నటి తనుశ్రీ దత్తా… నానా పటేకర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ చేసిన ఆరోపణల నుంచి సిని పరిశ్రమలో ఓ కుదుపు కుదిపేసింది. మరోవైపు ఇది దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలనూ ఉక్కిరిబిక్కిరి చేయటం ఆరంభించింది.
తనుశ్రీ ఆరంభించిన ట్విటర్ ను చూసి మరికొంతమంది హీరోయిన్లు తమకు ఎదురైన అనుభవాలను బయటపెట్టటం మొదలుపెట్టారు. ‘క్వీన్’ సినిమా చిత్రీకరణ సమయంలో ఆ చిత్ర దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ప్రముఖ నటి కంగనా రనౌత్ ఉత్తరాది నుంచి ‘మీ టూ’ ఉద్యమంలో దూకితే దక్షిణాదికి చెందిన గాయని చిన్మయి, నటి ఆషా శైనీ తామూ లైంగికంగా వేధింపులకు గురయ్యామంటూ వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ పత్రిక ‘హిందుస్థాన్ టైమ్స్’లో పని చేసిన ఒక మహిళా ఉద్యోగి తమ పత్రిక రాజకీయ విభాగం సంపాదకుడు తనను లైంగికంగా వేధించాడని వెల్లడించటంతో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు సమాచారం. టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ కె ఆర్ శ్రీనివాస్ తమ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ 7 గురు జర్నలిస్టులు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. పలువురు జర్నలిస్టులు అతనిని తొలగించాలని డిమాండ్ చేశారు.
మీటూ ఉద్యమ స్పూర్తితో మహిళలంతా తమకు జరిగిన అన్యాయాలను బయటపెడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.