అటల్ బిహారి వాజ్‌పేయి ఆజన్మ బ్రహ్మచారిగానే అందరికి తెలుసు కానీ ఆయనలో ఒక ప్రేమికుడు ఉన్నాడు. ఆయనొక ఆజన్మ ప్రేమచారి అనటంలో అతిశయోక్తి లేదు. ఆయన ప్రేమ కథ తెలిస్తే అందరూ అలానే అనుకుంటారేమో. ఎన్నో ప్రేమ కథల్లానే వాజ్‌పేయి ప్రేమ కథ కూడా పెళ్లి పీటలెక్కలేదు. కానీ ఆయన ప్రేమ కథ నిజమైన ప్రేమకి అద్దం పడుతుంది. ఈ కథ చదివితే మీకూ అర్ధమవుతుంది.
1942, గ్వాలియర్ విక్టోరియా కాలేజ్
అవి వాజ్‌పేయి గ్వాలియర్ విక్టోరియా కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న రోజులు. తన క్లాస్ లో ఒక యువతిపై మనసు పారేసుకున్నారు వాజ్‌పేయి. ఆమె పేరు రాజకుమారి. ఇద్దరికీ పరిచయం ఏర్పడింది కానీ ప్రేమని వ్యక్తం చేసుకోవటానికి ఆలస్యం అయ్యింది. అప్పటి ప్రేమికులలానే కళ్ళతో చూసుకుంటూ సరిపెట్టుకునేవారు. ఒకరోజు ఎలాగోలా ధైర్యం చేసి ఆమెకి తన మనసులోని మాట చెప్పేయాలి అనుకున్నారు వాజ్‌పేయి. అనుకున్నదే తడవుగా తన ప్రేమనంతా ఒక లెటర్ లో పొందుపరిచారు. ఆ ప్రేమ లేఖని ఒక పుస్తకంలో పెట్టి ఆమెకు అందించారు.
మూడు రోజులైనా రాజకుమారి మాత్రం తన అభిప్రాయాన్ని ఆయనకు తెలుపలేదు. మూడో రోజు తన సమాధానాన్ని ఆమె కూడా ఒక లేఖలో రాసి వాజ్‌పేయికి అందించడానికి ప్రయత్నించింది కానీ ఆమెకు నిరాశే మిగిలింది. అప్పటికే పని మీద ఢిల్లీ వెళ్లారు వాజ్‌పేయి. ఆయన గ్వాలియర్ రావటానికి ఆలస్యం కావడంతో ఆమె తన లేఖను అందించటానికి కుదరలేదు. ఈలోపు రాజకుమారి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్ద వాళ్లకు చెప్పారు రాజకుమారి.
ఇద్దరివీ బ్రాహ్మణ కుటుంబాలే అయినప్పటికీ రాజకుమారి వాళ్ళ పెద్దలు పెళ్ళికి అంగీకరించలేదు. ఎందుకంటే బ్రాహ్మణుల్లో కూడా శాఖలు ఉన్నాయి. ఆ పరంగా రాజకుమారి వాళ్ళకంటే వాజ్‌పేయి వారి శాఖ తక్కువ కావడం వారిద్దరి ప్రేమకి అడ్డంకిగా మారింది. వారి ప్రేమకి ఒప్పుకోని రాజకుమారి తల్లిదండ్రులు వారిద్దరిని విడదీయాలని ఆమెను గ్వాలియర్ నుండి బంధువుల ఇంటికి పంపించేశారు.1947 లో ఆమెను బ్రజ్ నారాయణ్ కౌల్ కి ఇచ్చి ఢిల్లీలో వివాహం చేశారు. బ్రజ్ నారాయణ్ ఒక కళాశాల అధ్యాపకుడు. పెళ్ళైన కొంతకాలానికి రాజకుమారిని, తన భర్తను గ్వాలియర్ తీసుకొచ్చారు.
ప్రేమించిన వ్యక్తి దూరం అయినప్పటికీ ఆయన కృంగిపోకుండా దేశసేవలో నిమగ్నమయ్యారు. మళ్ళీ పెళ్లి జోలికి వెళ్ళలేదు. పూర్తిగా తన దృష్టి రాజకీయాలపైన పెట్టారు. రాజకుమారి భర్త ఢిల్లీ యూనివర్సిటీలో రామజా కాలేజీలో అధ్యాపకునిగా పని చేస్తున్న సమయంలో ఆ దంపతులు ఢిల్లీలో నివసించేవారు. ఒకసారి అనుకోకుండా రాజకుమారిని కలిశారు వాజ్‌పేయి. ఆ తర్వాత ఆమె భర్తతో కూడా ఆయనకు స్నేహం మొదలయ్యింది. వారింటికి రాకపోకలు మొదలయ్యాయి. కొంతకాలానికి రాజకుమారి భర్త మరణించటంతో తన ఇద్దరు కూతుర్లు నమిత, నమ్రతతో జీవనం సాగిస్తున్నారు రాజకుమారి. నమితను అటల్ బిహారి వాజ్‌పేయి దత్తత తీసుకున్నారు. రాజకుమారి కూడా 2014 లో కాలం చేశారు.
తన ప్రేమ విషయంగానీ, తాను ప్రేమించిన వ్యక్తి గురించి గానీ ఎక్కడా, ఎప్పుడూ ప్రస్తావించలేదు వాజ్‌పేయి. స్త్రీపై ఆయనకి ఉన్న గౌరవం, ఆమె భవిష్యత్తు బావుండాలని ఆయన ఆలోచన నిజమైన ప్రేమకి నిదర్శనం. వీరి ప్రేమ విషయం కూడా రాజకుమారి మేనకోడలు ఒక ఇంటర్వ్యూలో తెలపడం వలన బయటకి వచ్చింది కానీ లేదంటే ఇప్పటికే తెలిసేది కాదేమో… ప్రేమలో విఫలమయ్యి జీవితాలను నాశనం చేసుకుంటున్న ఎంతోమంది యువతకు ఆయన సాధించిన విజయాలు, ఆయన జీవితం స్ఫూర్తిదాయకం.