పాతికేళ్ల క్రితం….మామగారిని వెన్నుపోటు పొడిచి అధికారలక్ష్మిని చెరబట్టి ఆరు మాసాలు తిరగకుండానే ఆయన్ని కైలాసవాసిని చేసిన చంద్రబాబు ప్రభ దుర్నిరీక్ష్యంగా వెలిగిపోతున్న రోజులు అవి! చంద్రబాబు యుగంధరుడని, మహామంత్రి తిమ్మరుసని, ఆర్య చాణక్యుడని ఆయన భజన పత్రికలు నక్కల్లా ఊళలు వేస్తున్న సమయం….రాష్ట్రంలోనే కాక, జాతీయస్థాయిలో కూడా చక్రాలు గిరగిరా తిప్పుతున్న చంద్రబాబు ప్రధానమంత్రులు, రాష్ట్రపతులను సైతం బొటనవేలితో నిర్ణయిస్తున్నాడని జాతీయపత్రికలు చంద్రబాబు విసిరిన బిస్కట్లను ఆవురావురుమంటూ నోటకరచుకుని, ఆయన పాదప్రక్షాళన చేసిన జలాన్ని పవిత్ర తీర్థంగా భావిస్తూ సేవిస్తూ రాస్తూ తరిస్తున్న కాలం అది!
చంద్ర బాబు ప్రభ వెలుగుతున్న రోజుల్లో
ఆ కాలంలో మోడీ అనే వ్యక్తి భాజపాలో ఏదో చిన్న సామాన్య కార్యకర్త. ఆయనకు ఢిల్లీ ఎక్కడుందో కూడా తెలుసోలేదో అన్నట్లుండేది. అలాంటి కాలంలో బీజేపీ అగ్రనేతలు అటల్ బిహారీ వాజపేయి, అద్వానీ, మురళి మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, ప్రమోద్ మహాజన్, ఇంకా అనేకానేకమంది నేతలు చంద్రబాబు అంటే అమిత భయభక్తులతో ఉండేవారు. చంద్రబాబు ఢిల్లీ వస్తున్నాడు అంటేనే వాజపేయి, ఆయన మంత్రులు బిక్కచచ్చిపోతుండేవారు. శ్రీవారి ప్రభలు ఆ రోజుల్లో అలా కోటిసూర్యప్రభాసమానంగా దివ్యకాంతులు విరజిమ్ముతుండేవి.
అలాంటి రోజుల్లో ఉమ్మడి రాష్ట్ర బీజేపీ నాయకులను చంద్రబాబు పురుగులకన్నా హీనంగా చూస్తూండేవారు. బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు, చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, బంగారు లక్ష్మణ్, హరిబాబు, కిషన్ రెడ్డి, ఇంకా అనేకమంది చంద్రబాబు దర్శనం కోసం పడిగాపులు కాస్తుండేవారు. తమను పైకి ఎదగకుండా చేస్తున్నాడని చంద్రబాబు మీద వారికి కోపం ఉండేది. నెలకోసారి ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి పితూరీలు మోస్తుండేవారు. అయితే అక్కడ వారికి అంతకన్నా ఘోరమైన అవమానం ఎదురయ్యేది. “మన లక్ష్యం ఢిల్లీ. రాష్ట్రంలో అధికారం మనకు ముఖ్యం కాదు. కాబట్టి చంద్రబాబుకు ఎదురు చెప్పవద్దు” అని వారి తలమీద అక్షింతలు వేసి పంపించేవారు. పాపం వాళ్ళు నవరంధ్రాలు మూసుకుని అవమానాన్ని దిగమింగుకుని వెనక్కు వచ్చేవారు. రాష్ట్రంలో అగ్రనేత అయిన ముప్పవరపు వెంకయ్యనాయుడు మొదటినుంచి మనిషి బీజేపీలోనే కానీ, ఆయన మనసు మొత్తం తెలుగుదేశంలోనే ఉండేది. అందువలన ఆయన రాష్ట్ర బీజేపీని తన శక్తికొద్దీ పాతాళానికి తొక్కేస్తూ చంద్రబాబుకు రాచబాటలు పరుస్తుండేవాడు.
ఇక రాష్ట్రం చీలిపోయిన తరువాత సాక్షాత్తూ మోడీయే చంద్రబాబుకు లొంగిపోవడంతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా చంద్రబాబుకు బానిసత్వం చెయ్యక తప్పలేదు. అధ్యక్షుడిగా వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబుకు బంటులా ప్రవర్తించి రాష్ట్ర శాఖను సర్వనాశనం చేసి ఏడు శాతంగా ఉన్న పార్టీ ఓటుబ్యాంకును ఒకటికన్నా తక్కువకు దించడంలో దిగ్విజయం సాధించాడు. చివరకు చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ప్రత్యక్షంగా పట్టుబడినప్పటికీ, ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయింది బీజేపీ. చంద్రబాబును ఏమీ చెయ్యలేక చేష్టలుడిగి కూర్చుంది. రాజకీయంగా లాభపడాలనే కనీస ఆలోచన కూడా చెయ్యలేకపోయింది. కారణం ఒకటే…రాష్ట్ర బీజేపీ లో చంద్రబాబు బానిసలు అనేకమంది వివిధ రూపాల్లో తిష్టవేసుకున్నారు. చంద్రబాబు అవినీతిలో వీరిలో కొంతమంది భాగస్వాములు. ఆఖరుకు మోడీతో చంద్రబాబు తెగతెంపులు చేసుకున్న తరువాత, చంద్రబాబు అధికారాన్ని కోల్పోయిన తరువాత కూడా రాష్ట్ర బీజేపీ చంద్రబాబుకు బానిసగానే వ్యవహరించింది.
బీజేపీ లో మార్పులో – బాబుకు ఎదురు దెబ్బ
కానీ, అంతలోనే ఒక్కసారిగా బీజేపీ అధ్యక్ష పదవినుంచి కన్నా లక్ష్మీనారాయణ గెంటివేయబడ్డాడు. ఆ స్థానంలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న సోము వీర్రాజు వచ్చారు. ఆయన వస్తూ వస్తూనే చంద్రబాబును తీవ్రంగా విమర్శిస్తూ ఆయన గుండెల్లో ఫిరంగులు పేల్చారు. బీజేపీ ముసుగులు వేసుకుని చంద్రబాబు పాట పాడుతున్న సుజనాచౌదరి, రమేష్ ల తోకలను కత్తిరించారు. మాజీ తెలుగుదేశం నాయకుడు లంకా దినకర్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సొంతపార్టీని తిడుతూ అమరావతి డ్రామా ఉద్యమంలో పాల్గొన్న వెలగపూడి రామకృష్ణను సస్పెండ్ చేశారు. ఒక క్షుద్రపత్రికలో వ్యాసం రాసిన నేరానికి రమణ అనే మరొక చంద్రబాబు బంటును సస్పెండ్ చేశారు. నెలరోజుల్లో వీర్రాజు తన విశ్వరూపం చూపించడంతో ఇప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడే బీజేపీ ముసుగువీరులు అందరూ నోళ్లకు తాళాలు వేసుకుని ఎప్పుడు షోకాజ్ నోటీస్ తమ చేతికి వస్తుందో అంటూ వణికిపోతూ కూర్చున్నారు. బీజేపీ ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తూ చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడితే సహించేది లేదని వీర్రాజు తేల్చి చెప్పారు.
ఇక అగ్నికి వాయువు తోడైనట్లు ఎప్పటినుంచో తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపిస్తున్న బీజేపీ కేంద్ర ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మరొకసారి తన ప్రతాపాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా చంద్రబాబు మోడీకి దగ్గర కావడానికి చేస్తున్న ప్రయత్నాలను ఎద్దేవా చెయ్యడమే కాక, పదహారేళ్లుగా అవినీతి కేసుల్లో చంద్రబాబు మీద స్టే కొనసాగుతున్నదని బాంబ్ పేల్చారు. ఆయన పేల్చిన బాంబ్ న్యాయవ్యవస్థను ఉద్దేశించి పేల్చిందే అని ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. జగన్ కు వ్యతిరేకంగా ఎవరు పిటీషన్ వేసినా, ఆఘమేఘాల మీద విచారిస్తున్న న్యాయస్థానం పదహారేళ్లుగా చంద్రబాబు మీద కొనసాగుతున్న స్టే ను ఎందుకు పట్టించుకోవడంలేదనే వ్యంగ్యం నరసింహారావు విమర్శలో కనిపిస్తున్నది.
తన రాజకీయ జీవితానికి రోజులు దగ్గర పడ్డాయని, సమీపకాలంలో జగన్ తనను జైలుకు పంపిస్తాడనే గట్టి నమ్మకం చంద్రబాబులో ఏర్పడిపోయింది. అందుకే ఆయన ఓడిపోయినది లగాయతు మోడీ కటాక్షవీక్షణం కోసం పరితపిస్తున్నాడు. మోడీని అమితంగా స్తుతిస్తున్నాడు. బీజేపీ వారికి సైతం కనిపించని సమర్ధత, నాయకత్వ లక్షణాలు మోడీలో చంద్రబాబుకు కనిపిస్తున్నాయి. అందుకే తాను ఢిల్లీలో చక్రాలు తిప్పుతున్న సమయంలో మోడీ అంటే ఎవరో కూడా దేశానికి తెలియదనే గతాన్ని విస్మరించి ఈరోజు మోడీ అనుగ్రహం కోసం నానా అగచాట్లు పడుతున్నాడు. మోడీ దర్శనం కోసం తహతహలాడుతున్నారు. ఇక ఒకప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకులను గడ్డిపోచకన్నా తీసిపారేసిన చంద్రబాబు నేడు అదే రాష్ట్ర బీజేపీ నాయకులు తనను ఘోరంగా విమర్శిస్తున్నా కుక్కినపేనులా పడిఉంటున్నారు. తిరిగి వారిని ఏమీ అనలేని నిస్సహాయస్థితిలోకి చేరుకున్నాడు!
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలు అవుతాయి అంటే ఇదే కాబోలు!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు