నటి సుమలతకు షాక్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ

ఒకనాటి హీరోయిన్, ఇటీవల మరణించిన ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ భార్య సుమలతకు కాంగ్రెస్ షాకిచ్చింది. ‘అభిమానుల వత్తిడి’ తో అంబరీష్ వారసత్వం కొనసాగించేందుకు ఆమె పోటీ చేయాలనుకుంటున్న మాండ్య లోక్ సభ నియోజవర్గం ఖాళీ లేదని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అది జెడిఎస్ సొత్తు అని ప్రకటించేసింది.

ఈ లోక్ సభ స్థానం నుంచి తమ భాగస్వామి జనత దళ్ ఎస్ అభ్యర్థి యే పోటీ చేస్తారని కర్నాటక రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డికె శివకుమార్ నిర్ద్వంద్వంగా ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాండ్యలో జెడి ఎస్ విజయపతాకం ఎగిరేసిందని, దాని వల్ల మాండ్య టికెట్ ఆ పార్టీకే చెందుతుందని , మాండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి జెడి ఎస్ అభ్యర్థి మాత్రమే పోటీ చేస్తారని శివకుమార్ ప్రకటించారు.

శివకుమార్ బెంగుళూరులో చేసిన ఈ ప్రకటన సంచలనం సృష్టిస్తున్నది. ఎందుకంటే, మాండ్య లోక్ సభ టికెట్ ను నటి సుమలతకు కేటాయించాలని మాండ్య కాంగ్రెస్ కార్యకర్త్తలు పార్టీ మీద వత్తి డి తీసుకువస్తున్నారు. అదే విధంగా ఈ టికెట్ తనకు ఇచ్చి అంబరీష్ అభిమానుల మద్దతు కాంగ్రెస్ కూడగట్టుకోవాలని కోరుతూ ఆమె అయిదారు రోజుల కిందట సిఎల్ పి నేత సిద్ధ రామయ్యను కూడా కలిశారు. అపుడు సిద్ధరామయ్య స్పందించలేదు. అయితే పార్టీ విధానాన్ని ఆయన శివకుమార్ తో చెప్పించారు.

అసలేం జరిగింది

కర్నాటకలో అంబరీష్ చాలా పేరున్న నటుడు. బలమయని అభిమాన సంఘాల నెట్ వర్క్ కూడా ఉంది. అంబీరీష్ కావేరి జిలాలలో సుసంపన్నమయిన మాండ్య జిల్లాకు చెందిన వాడు. అందుకే సుమలతా కూడా మాండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అంబరీష్ మూడో మాసికం సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ అభిమానుల వత్తిడికి తలొగ్గాల్సి వస్తున్నదని, అందుకే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించకున్నట్లు చెప్పారు. ‘అంబరీష్ రాజకీయజీవితమంతా కాంగ్రెస్ లోనే సాగింది. మా మిత్రులు, బంధువులు కాంగ్రెస్ లో నే ఉన్నారు. అందువల్ల నేను కాంగ్రెస్ నుంచ పోటీ చేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్ కూడా నాకు టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నాను,’అని సుమలత చెప్పారు.
ఫిబ్రవరి 20 వ తేదీన ఆమె కాంగ్రెస శాసన సభా పక్ష నాయకుడు సిద్దరామయ్యను కలిశారు. తాను పోటీ చేయాలనుకుంటున్న అభిలాష వ్యక్తం చేసి, తనకు మాండ్య టికెట్ కేటాయించాలని కోరారు.

సిద్ధరామయ్య నుంచి ఇంకా స్పందనరాలేదు. ఎందుకంటే, ఆమె అడుతున్నది చిన్న కోర్కె కాదు.  దేవేగౌడ వంటి పెద్దమనిషి మనవడి  రాజకీయ ప్రవేశం కోసం రిజర్వు చేసుకున్న సీటు అది. ఇప్పటికే ఈ విషయాన్ని కుమారస్వామి, దేవేగౌడ చాలా సార్లు దీనిని స్పష్టంగా వ్యక్తీకరించారు. ఇలాంటి సీటను మా కివ్వండని దేవేగౌడను అడగటమే కష్టం…

అయితే, సమస్య ఏమిటంటే మాండ్య నుంచి ముఖ్యమంత్రి హెచ్ డి కుమార స్వామి కుమారుడు పోటీ చేయించాలనుకుంటున్నారు. మనవడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి, ఢిల్లీకి పంపాలనుకుంటున్నట్లు ఆ మధ్య మాజీ ప్రధాని, కుమారస్వామి తండ్రి దేవే గౌడ కూడా చెప్పారు. దానికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాండ్య జిల్లాలోని ఏడు అసెంబ్లీ సీట్లన్ను జనతా దళ్ ఎస్ గెల్చుకుంది. అందువల్ల మాండ్య లోక్ సభ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సీట్ల అవగాహన కింద కాంగ్రెస్ కు వదలుకోవద్దని జెడిఎస్ కార్యకర్తలనుంచి వత్తిడి వస్తున్నది. అందువల్ల సుమలత వత్తిడి వల్ల కాంగ్రెస్, జెడిఎస్ ల మధ్య మాండ్య వివాదం రాజుకునే పరిస్థితి ఉంది. 

జెడిఎస్ తో వివాదం వద్దు 

మాండ్య టికెట్ ను కోరి మాజీ ప్రధాని దేవేగౌడను, ముఖ్యమంత్రి కుమార స్వామిని ఇరుకున బెట్డడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు. మాండ్య సీటు కంటే, జెడిఎస్ తో కాంగ్రెస్ కు స్నేహం చాలా అవసరం. బెంగుళూరు సంకర్ణ ప్రభుత్వం నిలవాలి అదే విధంగా  ఢిల్లీ లో మోదీని ఓడించేందుకు కూడా జెడిఎస్ స్నేహం చాలా అవసరం.అందుకే ఎక్కువ రోజులు నాన్చకుండా  కాంగ్రెస్ పార్టీ మాండ్య లోక్ సభ స్థానం మీద స్సష్టత నిస్తూ ఆ సీటు జెడిఎస్ దే నని ప్రకటించింది.  జెడిఎస్ తో వివాదం  అంత మంచిది కాదన్నది కాంగ్రెస్ ముఖ్యం. కాంగ్రెస్ పార్టీకి ఇపుడున్న పరిస్థితుల్లో సుమలత కంటే జెడిఎస్ చాలా అవసరం. అందుకే  కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా పేరున్న శివకుమార్ తో  మాండ్య సీటు జెడిఎస్ దే నని చెప్పించారు.

సుమలతకు కాంగ్రెస్ టికెట్ రానిపక్షంలో ఆమె వెనక్కు తగ్గకుండా, మరొక పార్టీలో చేరకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే, ఆమె ఇపుడేం చేస్తారో చూడాలి.