ఆ పార్టీలోకి సీనియర్ హీరోయిన్

కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ మెల్లగా అన్ని రాష్ట్రాలకి విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణలో వచ్చే ఎన్నికలలో పాగా వ్హేయడానికి బీజేపీ పార్టీ బలంగా ఫైట్ చేస్తుంది. ఇక సౌత్ లో కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక వచ్చే ఎన్నికలలో కూడా కర్ణాటకలో మళ్ళీ తామే అధికారంలోకి రావాలని మోడీ, అమిత్ షా టీమ్ ఆలోచిస్తుంది. దానికి తగ్గట్లుగా కర్ణాటకలో మరింత బలం పెంచుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.

ఇందులో భాగంగా సెలబ్రిటీలని కూడా పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కాంతారా హీరో రిషబ్ శెట్టి కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీని కలిసారు. నిర్మాత విజయ్ కిరంగదూర్ కూడా కలిసారు. ఇదిలా ఉంటే తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం మాండ్యా నియోజకవర్గం ఎంపీగా ఉన్న సుమలతని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మండ్యా జిల్లాలో అంబరీష్ ఫ్యామిలీకి మంచి సపోర్ట్ ఉంది.

అయితే అంబరీష్ చనిపోయిన తర్వాత సుమలత ఆయన వారసత్వాన్ని తీసుకొని రాజకీయాలలోకి వచ్చి ప్రజలకి అండగా నిలబడింది. ఈ నేపధ్యంలో సుమలతని పార్టీలోకి తీసుకొస్తే కచ్చితంగా మాండ్యాతో పాటు మైసూర్ నియోజకవర్గాలలో బీజేపీ ప్రభావం పెరుగుతుందని భావిస్తున్నారు. అందుకే ఇండిపెండెంట్ ఎంపీగా ఉన్న ఆమెని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇక సుమలత కూడా ఆ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నారనే మాట వినిపిస్తుంది.

బెంగుళూర్ – మైసూర్ ఎక్స్ ప్రెస్ రహదారిని ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోడీ మాండ్యా వెళ్లనున్నారు. ఆయన సమక్షంలో సుమలత బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం నడుస్తుంది. అయితే ఆమె తనయుడు రాజకీయాలలోకి వస్తాడని, అతని కోసమే సుమలత బీజేపీ గూటికి వెళ్తుంది అంటూ ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. అయితే తన కొడుకు కోసం బీజేపీలో చేరడం లేదని, అతనికి రాజకీయాలపై ఆసక్తి లేదని సుమలత క్లారిటీ ఇచ్చారు. మోడీ పరిపాలన నచ్చి తనకి తానుగా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.