ప్రముఖ నటి సుమలత పంతం నెగ్గేలా కనిపిస్తున్నది.ఆమె భర్త (స్వర్గీయ) అంబరీస్ నియోజకవర్గాన్ని జెడిఎస్ నుంచి దక్కించుకునే అవకాశాలు మెరుగుపడ్డాయి.
కూటమి ధర్మం అంటూ మాండ్య లోక్ సభ స్థానాన్ని జెడిఎస్ కు వదలి పెడ్తున్నామని, అది సహజంగానే జెడిఎస్ కే చెందుతుందని, అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్న నటి సుమలతను నిరుత్సాహ పరుస్తూ కర్నాటక కాంగ్రెస్ స్పష్టం చేసిన సంగతి తెలిసింది.
అక్కడి నుంచి జెడిఎస్ అభ్యర్థిగటా ముఖ్యమంత్రి హెచ్ డి కుమార స్వామి కుమారుడు నిఖిల్ లోక్ సభకు పోటీ చేయాలనుకుంటున్నారు.
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాండ్యా జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నందున, మాండ్య లోక్ సభ స్థానం ఆ పార్టీ సొత్తు అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంత్రి శివకుమార్ ప్రకటించారు.
ఈ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, నటి, ఇటీవల మరణించిన మాజీ కాంగ్రెస్ కేంద్ర మంత్రి అంబరీష్ భార్య సుమలత అక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నారు. మాండ్య నుంచి పోటీ చేయాలని అంబరీష్ అభిమానులంతా ఆమె మీద వత్తిడి తెస్తున్నారు. అంబరీష్ కూడా అక్కడి నుంచే పోటీ చేస్తూ వచ్చారు. తాను కాంగ్రెస్ రాజకీయాలలో అంబరీష్ వారసత్వం కొనసాగించాలనుకుంటున్నానని, మాండ్య లోక్ సభ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆమె సిఎల్ పి నేత సిద్ధరామయ్యను కోరారు.
దీని మీదే వివరణ ఇస్తూ అది సాధ్యం కాదని శివకుమార్ ప్రకటించారు.
అయితే, తాను వెనక్కి తగ్గేది లేదని, అవసరమయితే ఇండిపెండెంటుగా పోటీ చేస్తానని సుమలత ప్రకటించారు. ఆ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బాగా అభిమానుల మద్దతు ఉన్న సుమలత ఇండిపెండెంటుగా పోటీ చేస్తే జెడిఎస్ అభ్యర్థికి నష్టం జరగుతుందని ముఖ్యమంత్రి కుమార స్వామి భావించినట్లున్నారు. కుమారుడు నిఖిల్ ను మాండ్యలో కాకుండా, మైసూరు-కొడగు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ విషయం నిఖిల్ నోటీ నుంచే వెలువడింది. శనివారం నాడు మైసూరులో జరిగిన ఒక పౌర సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ తాను మైసూరు లో రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం కల్పించాలని నిఖిల్ అక్కడి ప్రజలను ప్రకటించారు.
నిజానికి మాండ్య నిఖిల్ కు సేఫ్ జోన్ అనుకున్నారు. ఆయన సునాయాసంగా లోక్ సభ ఎన్నికల్లో గెలిచేందుకు ముఖ్యమంత్రిగా కుమార స్వామి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆయన ఈ మధ్యనే రు. 5000 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. అయితే, సుమలత మాండ్య నుంచి పోటీ చేయాలని గట్టిగా నిర్ణయించుకోవడం, ఆమెకు ప్రజల నుంచి బాగా మద్దతు వస్తూ ఉండటంతో కుమార స్వామి కుటుంబంలో పునరాలోచన మొదలయిందని వార్తలొస్తున్నాయి.
నిజానికి అంబరీస్ , దేవేగౌడ్ కుటుంబాలకు మధ్య చాలా మంచి స్నేహం ఉంది. 1994లో అంబరీష్ కాంగ్రెస్ పార్టీలో చేరినా, 1998 లో ఆయన ఎన్నికల్లో పోటీ చేసింది జనతాదళ్ అభ్యర్థిగానే. దానికి అంబరీష్, నిఖిల్ కూడా సినిమాల్ల సమకాలీనులు, మంచిస్నేహితులు. కులం కూడా ఒకటే. వొక్కలిగ కులం బలంగా ఉన్న ప్రాంతాలలో జనతా దల్ ఎస్ గెలుపొందేందుకు అంబరీష్ పరోక్షంగా సాయం చేశారు.
దీనికోసమే ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ కూడా చేయలేదని చెబుతారు.
మాండ్య మీద నిఖిల్ కూడా పట్టుబడితే రెండు కుటుంబాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని కుమార స్వామి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. పెద్దల సలహా మేరకే నిఖిల్ ఇపుడు మైసూరుకు వెళ్లాలని యోచిస్తున్నారని వార్త.