కనకదుర్గ గుర్తుందిగా! శబరిమల ఆలయ నిబంధనలు వద్దంటున్నా, వేలాది మంది భక్తులు అడ్డుపడుతున్నా సుప్రీంకోర్టు చెప్పిందనే ఒకే ఒక్క కారణంతో.. అయ్యప్పను దర్శించిన 43 సంవత్సరాల వయస్సున్న మహిళ. ఇప్పుడామె ఆసుపత్రి పాలయ్యారు. కారణం- అత్తింటి వారి దాడులకు గురయ్యారు. సంప్రదాయానికి విరుద్ధంగా శబరిమల ఆలయంలో అడుగు పెట్టిందనే ఆగ్రహంతో కనకదుర్గ అత్త దాడి చేశారు. రోకలిబండతో కుళ్లబొడిచారు.
మళప్పురం జిల్లాలోని అంగడిప్పురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కనకదుర్గకు భర్త కృష్ణన్ ఉన్ని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త, పిల్లలు, అత్త సుమతితో కలిసి ఆమె అంగడిప్పురంలో నివసిస్తున్నారు. శబరిమల ఆలయాన్ని సందర్శించి వచ్చిన అనంతరం.. ఆమె చాలాకాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె బయట కనిపించితే భక్తులు దాడులు చేస్తారనే భయంతో ఆమె బయటి ప్రపంచంలోకి రాలేదు.
సోమవారం కోచిలో జరిగిన `అర్పో అర్థవం` కార్యక్రమంలో పాల్గొన్నారు. శబరిమలను దర్శించిన అనంతరం ఆమె జనజీవనంలోకి రావడం ఇదే తొలిసారి. ఆ కార్యక్రమంలో పాల్గొన్న తరువాత మంగళవారం ఉదయం అత్తింటికి వచ్చారు. ఈ సందర్భంగా సుమతి ఆమెతో గొడవ పడ్డారు. సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల హైందవ సమాజం తమను వెలివేసినట్టు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా తోపులాట చోటు చేసుకుంది. ఆగ్రహించిన సుమతి రోకలిబండతో కనకదుర్గపై దాడి చేశారు. తలపై మోదారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. సుమతికి కూడా గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు వారిద్దరినీ వెంటనే పెరింథల్‌మన్న ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పెరింథల్‌మన్న పోలీసులు కేసు నమోదు చేశారు.